Share News

సప్తరాత్రోత్సవాలను విజయవంతం చేయండి

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:49 PM

ప్రతిఏటా జరిగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సప్త రాత్రోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు భక్తులకు పిలుపునిచ్చారు.

   సప్తరాత్రోత్సవాలను విజయవంతం చేయండి
అభివృద్ది పనుల ఫోటోలను చూపిస్తున్న పీఠాధిపతి, రాజా పి అప్రమేయాచార్‌

27 నుంచి ఉత్సవాలు ప్రారంభం

వేడుకల్లో కీలక ప్రాజెక్టుల ప్రారంభం

శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు

మంత్రాలయం, ఆగస్టు 24 ( ఆంధ్రజ్యోతి): ప్రతిఏటా జరిగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సప్త రాత్రోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు భక్తులకు పిలుపునిచ్చారు. సోమవారం స్వామీజీ తన గదిలో ఉత్సవాలపై విలేకరుతో మాట్లాడారు. ఈనెల 27 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు సప్త రాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో ప్రధానమైన రాఘవేంద్రస్వామి 29న పూర్వారాధన, 30న మధ్యారాధన, 31న ఉత్తరాధనరోజు మహరథోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజూ సాయంత్రం యోగీంద్ర కళామండపంలో దాసవాణి సాహిత్యం, కూచిపూడి నృత్యం, భరతనాట్యం, వీణావాయిద్యం, పౌరాణిక నాటకాలు భక్తులను అలరిస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేశారు. భక్తులకు శ్రీమఠంలోని అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ అధికారుల సమష్టి సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాగునీరు, వసతి, ఉచిత భోజనం, దర్శన క్యూలైన్లు, పరిశుభ్రత, వాహనాల పార్కింగ్‌, పరిమళ ప్రసాదం, ఉచిత వైద్య శిబిరం, అంబులెన్సు, నదీతీరంలో పుణ్యస్నానాలు, మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు గదులు, వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు, వీఐపీలకు ప్రత్యేక ప్రోటోకాల్‌ వంటి ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులకు, గర్భిణీ, బాలింతలకు శీఘ్ర దర్శనం, భోజనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఫ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి-2026 అవార్డులు

మంత్రాలయానికి చెందిన గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం ప్రిన్సిపాల్‌ విద్వాన డాక్టర్‌ ఎన.వాదిరాజాచార్య, తమిళనాడుతోని తంజవూరు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఎస్‌.వైద్య సుబ్రహ్మణ్యంకు 29న శనివారం రాత్రి అత్యంత గౌరవ ప్రదమైన రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి-2026 అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు.

ఫ కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ.13 కోట్లతో టాటా టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సంస్థ) ఆధ్వర్యంలో 3.1 కిలోమీటర్ల మేర అండర్‌ డ్రైనేజీ పైప్‌లైన, ఎస్‌టీపీ (సెవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు) 20 హెపీ మోటార్లతో 30 లక్షల లీటర్ల మురికి నీటిని శుద్ధిచేసే ప్లాంటును ప్రారంభిస్తామని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు వెల్లడించారు. అదే విధంగా రూ.7 కోట్లతో ముంబాయికి చెందిన ప్రముఖ బిల్డర్‌ షాపూర్‌జీ, మిశ్రజీల విరాళంతో మరో రూ. 3 కోట్లతో రామాయణ థీమ్‌పార్క్‌ ప్రారంభానికి సిద్ధంచేశామని తెలిపారు. రూ.కోటితో ప్రధాన రహదారిలో సుజయీంద్ర మార్గ్‌, రూ.4కోట్లతో రఘునందన తీర్థ డార్మెటరీ పనులు పూర్తయ్యాయని, ఉత్సవాల్లో ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా రాఘవేంద్ర సర్కిల్‌ పాత ఆర్‌అండ్‌బీ స్థలంలో శ్రీమఠం వంద కోట్ల ఖర్చుతో 12 అంతస్తుల భవనం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నరహరితీర్థ గెస్ట్‌హౌస్‌ సమీపంలో రూ.22కోట్లతో 150 గదులు నిర్మాణానికి త్వరలో భూమిపూజ చేస్తామన్నారు. బెంగుళూరుకు చెందిన హెచసీఎల్‌ సంస్థ రూ.50 కోట్లతో 40 ఎకరాల్లో 6 నెలలకు సరిపోయే తాగునీటి రిజర్వాయర్‌ పనులకు భూమిపూజ చేశామని త్వరలో పనులు ప్రారంభమవుతాయని పీఠాధిపతి తెలిపారు.

Updated Date - Aug 24 , 2026 | 11:49 PM