Share News

High Court Building: 48 గంటల్లో 3 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌

ABN , Publish Date - Jan 13 , 2026 | 05:04 AM

అమరావతి రాజధానిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో భాగంగా 48 గంటల్లోనే 3 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ నింపే పనిని సీఆర్‌డీఏ పూర్తి చేసింది.

High Court Building: 48 గంటల్లో 3 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌

  • ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో కీలక మైలురాయి

  • శనివారం రాత్రి ప్రారంభమై సోమవారం రాత్రి ముగిసిన పని

  • ఆగకుండా షిఫ్టుల వారీగా పనిచేసిన వందలాది కార్మికులు

గుంటూరు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో భాగంగా 48 గంటల్లోనే 3 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ నింపే పనిని సీఆర్‌డీఏ పూర్తి చేసింది. 3026 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనిని 48 గంటల్లో పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈ నెల 10వ తేదీ రాత్రి పని ప్రారంభించి సోమవారం రాత్రికి పూర్తిచేసింది. దీనికోసం వందలాది మంది కార్మికులు షిఫ్టుల వారీగా పని చేసి.. ఎక్కడా పని ఆపకుండా శ్రమించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ కే కన్నబాబు పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలు అందించారు. నిర్ణీత వ్యవధిలో కాంక్రీట్‌ పని పూర్తి కావడంపై సీఆర్‌డీఏ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. నేలపాడుకు సమీపంలో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణ పనులను సీఆర్‌డీఏ గతేడాది పునఃప్రారంభించింది. 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు ఆగిపోవడంతో పునాదులలోకి భారీగా నీరు చేరింది. ఆ నీటిని అంతా తోడించి ఫౌండేషన్‌కు సంబంధించి ఐఐటీ నిపుణుల నుంచి సర్టిఫికెట్‌ తీసుకున్నాక పనులను పునఃప్రారంభించారు. హైకోర్టు భవనాన్ని 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్‌మెంట్‌ + గ్రౌండ్‌ + 7 అంతస్తులుగా నిర్మించనున్నారు. మొత్తం 52 కోర్టు హాల్స్‌ కూడా నిర్మాణం చేస్తారు.

Updated Date - Jan 13 , 2026 | 05:04 AM