Share News

ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:47 AM

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న ఫార్మాసిటీలోని శ్రీసాయిచందన (ఏపీఐ) ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

  • కార్మికులు సురక్షితం, రూ.10 కోట్ల ఆస్తి నష్టం

పరవాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న ఫార్మాసిటీలోని శ్రీసాయిచందన (ఏపీఐ) ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు, కార్మికులు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణ హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పరవాడ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రొడక్షన్‌ బ్లాక్‌-2లో రియాక్టర్‌ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో షిఫ్ట్‌ ఇన్‌చార్జి వెంటనే కార్మికులందరినీ అప్రమత్తం చేశారు. 4 కేఎల్‌ సామర్థ్యం గల రియాక్టర్‌లో ఒమెప్రజోల్‌ (ఔషధం) ఉత్పత్తి చేస్తుండగా మిథనాల్‌ బయటకు రావడంతో క్షణాల్లో బ్లాక్‌ అంతా మంటలు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. మంటల ఉధృతిని గమనించిన కార్మికులు బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే అగ్నికీలలు ప్రొడక్షన్‌ బ్లాక్‌ అంతా వ్యాపించాయి. తొమ్మిది అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశాయి. సుమారు రూ.ఐదు నుంచి పది కోట్ల మేర ఆస్తి నష్టం ఉండవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 04:48 AM