Share News

‘కల్తీ’ కంపెనీల ‘కంత్రీ’ కుట్ర

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:13 AM

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కుట్ర కోణం బయటపడింది. టీటీడీకి రూ.250 కోట్లకు పైగా విలువైన 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ‘కంత్రీ’ తెలివితేటలు వాడారు.

‘కల్తీ’ కంపెనీల ‘కంత్రీ’ కుట్ర

  • నెయ్యి వైష్టవి, మాల్‌ గంగా నుంచి.. శాంపిల్స్‌ హెరిటేజ్‌, సంగం నుంచి

  • రిపోర్టు కోసం వీటిని ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌కు.. ఈ ‘నాణ్యమైన’ నివేదికలు చూపి టీటీడీకి

  • ‘కల్తీ’ నెయ్యి ట్యాంకర్ల సరఫరా..ఇలా 250 కోట్ల విలువైన 60 లక్షల కిలోలు పంపిణీ

  • భోలే బాబా డెయిరీలో తయారీ.. సిట్‌ దర్యాప్తులో వెలుగులోకి

  • వైష్ణవి డెయిరీలో హెరిటేజ్‌, హట్సన్‌, సంగం, దొడ్ల నుంచి ‘శాంపిల్స్‌’ రశీదులు లభ్యం

తిరుపతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కుట్ర కోణం బయటపడింది. టీటీడీకి రూ.250 కోట్లకు పైగా విలువైన 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ‘కంత్రీ’ తెలివితేటలు వాడారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ముందు ల్యాబ్‌ టెస్టింగ్‌ కోసం పొమిల్‌ జైన్‌ తదితర నిందితులు ఇతర నాణ్యమైన సంస్థల నుంచి అర లీటరు, కిలో టిన్నుల్లో నెయ్యి కొనుగోలు చేశారు. వాటి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపి ‘నాణ్యమైన’ నివేదికలు తెప్పించుకున్నారు. టీటీడీకి మాత్రం భోలేబాబా డెయిరీలో కల్తీ నెయ్యి తయారు చేసి దాన్నే వైష్ణవి, మాల్‌గంగా తదితర డెయిరీల ద్వారా సరఫరా చేశారు. టీటీడీకి ప్రతీ కల్తీ నెయ్యి ట్యాంకర్‌తో పాటు ఇతర సంస్థల నెయ్యి శాంపిల్స్‌ ‘నాణ్యమైన’ నివేదికలు పంపారు. అంటే.. ట్యాంకర్‌లో ఉన్న నెయ్యి భోలేబాబా డెయిరీలో తయారు చేసిన కల్తీది. నివేదిక మాత్రం ఇతర కంపెనీల నాణ్యమైన నెయ్యి శాంపిల్‌ది. ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ ఎక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) రిపోర్టుల కోసం ఇతర డెయిరీల నుంచీ నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసి దాన్ని శాంపిల్స్‌గా పంపించిన వైనం సిట్‌ దర్యాప్తులో వెలుగు చూసింది. ల్యాబ్‌ టెస్టింగ్‌ కోసం పొమిల్‌ జైన్‌ తదితర నిందితులు నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసిన డెయిరీలలో హెరిటేజ్‌ సహా పలు ఇతర డెయిరీలు ఉండడం గమనార్హం. సిట్‌ దర్యాప్తులో భాగంగా వైష్ణవి తదితర డెయిరీలను తనిఖీ చేసిన సందర్భంలో ఇతర డెయిరీల నుంచీ నెయ్యి కొనుగోలు చేసిన రశీదులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆరా తీసిన సిట్‌ బృందానికి విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.


లోగుట్టు రట్టు

టీటీడీ నెయ్యి సరఫరా టెండరు నిబంధనల ప్రకారం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే డెయిరీ సంస్థలు ప్రతి ట్యాంకర్‌తో పాటు ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ రిపోర్టు పంపించాలి. అయితే పొమిల్‌ జైన్‌ తదితరులు భోలేబాబా డెయిరీలోనే కల్తీ నెయ్యి తయారు చేసి దాన్నే వైష్ణవి, మాల్‌గంగా తదితర డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారు. ఆ క్రమంలో ప్రతి ట్యాంకర్‌కూ ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ టెస్టింగ్‌ రిపోర్టు పంపాలి కాబట్టి శాంపిల్‌ నెయ్యి మాత్రం నాణ్యంగా ఉండేలా మాయ చేశారు. దానికోసం హెరిటేజ్‌, సంగం, హట్సన్‌, దొడ్ల వంటి డెయిరీల నుంచీ అర లీటరు, కిలో టిన్నుల్లో నెయ్యి కొనుగోలు చేస్తూ వచ్చారు. ఆ నెయ్యిని ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌కు పంపించారు. హెరిటేజ్‌, సంగం, హట్సన్‌, దొడ్ల డెయిరీల నెయ్యి నాణ్యమైనది కావడంతో నాణ్యతా ప్రమాణాల పరీక్షలో మంచి ఫలితాలు వచ్చేవి. నాణ్యమైన నెయ్యి అంటూ ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ రిపోర్టులు ఇచ్చేది. ఆ రిపోర్టులను తమ కల్తీ నెయ్యితో కూడిన ట్యాంకర్ల వెంట పొమిల్‌జైన్‌ తదితరులు టీటీడీకి అందజేస్తూ వచ్చారు. దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు వైష్ణవి డెయిరీని తనిఖీ చేసినపుడు వారికి హెరిటేజ్‌, సంగం, దొడ్ల, హట్సన్‌ తదితర డెయిరీల నుంచీ తక్కువ పరిమాణంలో నెయ్యి కొనుగోలు చేసిన రశీదులు లభించాయి.

నాణ్యమైన నెయ్యి ధరలు ఇలా..

పొమిల్‌ జైన్‌ తదితరులు ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ రిపోర్టు కోసం ఇతర డెయిరీల నుంచీ కొనుగోలు చేసిన శాంపిల్‌ నెయ్యి ధరలు బహిరంగ మార్కెట్‌లో ఆయా డెయిరీల నాణ్యతను ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు కిలో నెయ్యి హెరిటేజ్‌ నుంచి రూ.740తో, హట్సన్‌ నుంచి రూ.800, దొడ్ల నుంచి రూ.780 ధరతో కొన్నారు. సంగం నుంచీ సుమారు రూ.620 ధరతో కిలో నెయ్యి కొనుగోలు చేశారు. ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ రిపోర్టుల కోసం ఇతర డెయిరీల నుంచీ ఇంత ధరతో నెయ్యి కొనుగోలు చేసిన పొమిల్‌ జైన్‌ తను మాత్రం వైష్ణవి డెయిరీ, మాల్‌ గంగా ద్వారా టీటీడీకి కిలో రూ.400 లోపు ధరతో 60 లక్షల కిలోలకు పైగా నెయ్యి సరఫరా చేయడం గమనార్హం.


ఇవిగో ఉదాహరణలు

  • సిట్‌ అధికారులకు లభ్యమైన పలు రశీదుల్లో పొమిల్‌ జైన్‌ తదితరులు పరీక్షలకు పంపేందుకు శాంపిల్స్‌ కోసం ప్రముఖ డెయిరీల నుంచి నెయ్యి కొనుగోలు చేసిన వివరాలు మచ్చుకు కొన్ని..

  • హెరిటేజ్‌ డెయిరీ నుంచి 2023 అక్టోబరు 31న రూ.1100 వెచ్చించి ఒకటిన్నర లీటరు నెయ్యి కొనుగోలు చేశారు. అదే ఏడాది నవంబరు 1న రూ.740 పెట్టి కిలో నెయ్యి కొన్నారు.

  • హట్సన్‌ నుంచి 2023 అక్టోబరు 25న రూ.2,460 పెట్టి మూడు కిలోలు, డిసెంబరు 10న రూ. 9,600 వెచ్చించి 12కిలోల నెయ్యి కొన్నారు.

  • 2023 జూన్‌ 12న దొడ్ల నుంచి రూ.780 పెట్టి కిలో నెయ్యి కొనుగోలు చేశారు.

  • సంగం నుంచి 2023 జూన్‌ 27న రూ.310 ధరతో 500 మిల్లీలీటర్ల నెయ్యి బాటిళ్ళు రెండు కొన్నారు. దానికోసం రూ.620 చెల్లించారు.

  • పొమిల్‌ జైన్‌ ద్వారా వైష్ణవి, మాల్‌గంగా తదితర డెయిరీల నుంచి టీటీడీకి సరఫరా అయిన ప్రతి ట్యాంకర్‌ వెనుకా ఈ ‘శాంపిల్స్‌’ కథే నడిచింది.

Updated Date - Feb 07 , 2026 | 04:15 AM