కొత్త కొత్తగా.. సుదీర్ఘంగా
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:10 AM
ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటర్ విద్యామండలి తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో పరీక్షల స్వరూపం చాలా వరకు మారిపోయింది.
సమూలంగా మారిన ఇంటర్ పరీక్షలు
16 నుంచి 23కు పెరిగిన పరీక్ష రోజులు
ఈ ఏడాది నుంచి ఒకరోజు ఒక్క సబ్జెక్టే
ప్రాక్టికల్ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల
ఏ కారణంతోనూ హాల్‌టికెట్లు ఆపొద్దు: సెక్రటరీ
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటర్ విద్యామండలి తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో పరీక్షల స్వరూపం చాలా వరకు మారిపోయింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం 16 రోజుల్లో పరీక్షలు ముగుస్తుండగా.. ఈ ఏడాది నుంచి 23 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. పాత విధానంలో ఒక్కోరోజు రెండు లేదా మూడు సబ్జెక్టుల పరీక్షలు జరిగేవి. కానీ, ఇప్పుడు ‘ఎలక్టివ్’ విధానంతో ఒక రోజు ఒక సబ్జెక్టు పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు. మరోవైపు ఎలక్టివ్ విధానంతో విద్యార్థులు వారి కాంబినేషన్‌కు సంబంధం లేని సబ్జెక్టులు తీసుకుంటున్నారు. అనేక మంది విద్యార్థులు ఎంబైపీసీ చదువుతున్నారు. ఇలాంటి వారికి నూతన విధానం మేలు చేయనుంది.
ఆరు నుంచి ఐదు!
చాలా కాలం నుంచి ఇంటర్మీడియట్‌లో గణితం ఏ, బీ రెండు సబ్జెక్టులుగా ఉంది. దీనిని ఈ విద్యా సంవత్సరంలో ఒకే సబ్జెక్టుగా మార్చారు. అలాగే వృక్ష, జంతు శాస్త్రాలు రెండు సబ్జెక్టులుగా ఉంటే వాటిని కూడా కలిపి బయాలజీ చేశారు. దీంతో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో సబ్జెక్టులు ఆరు నుంచి ఐదుకు తగ్గాయి. రెండు గ్రూపుల విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ర్టీ సబ్జెక్టులు కామన్‌గా ఉంటాయి. ఇంగ్లిష్ సబ్జెక్టును మాత్రం ఆర్ట్స్‌తో సహా అన్ని గ్రూపుల విద్యార్థులు తప్పనిసరిగా తీసుకోవాలి. మరొక సబ్జెక్టును ఎలక్టివ్‌గా తీసుకోవచ్చు. దీంతో ఇంటర్మీడియట్‌లో ఉన్న మొత్తం 24 సబ్జెక్టుల నుంచి ఏ గ్రూపు విద్యార్థి అయినా ఏ సబ్జెక్టునైనా ఎలక్టివ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. దీంతో చాలా మంది విద్యార్థులు వారి గ్రూపు కాంబినేషన్‌కు ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్టులు తీసుకున్నారు. సీఈసీ విద్యార్థుల్లో అనేక మంది చరిత్ర(హిస్టరీ) తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా ఎంపీసీ విద్యార్థుల్లో చాలా మంది జాగ్రఫీ తీసుకుని చదువుతున్నారు. అలాగే కామర్స్, చరిత్ర తీసుకున్న వారు కూడా ఉన్నారు. సుమారు 3 వేల మంది విద్యార్థులు వారి గ్రూపునకు సంబంధం లేని సబ్జెక్టులు ఎంచుకున్నారు.
వారికి మరింత అవకాశం
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇంటర్ విద్యామండలి మరింత విస్తృత అవకాశం కల్పించింది. మిగిలిన గ్రూపులకు లేనివిధంగా అదనపు సబ్జెక్టు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సుమారు వెయ్యి మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, 3 వేల మంది బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకుని చదువుతున్నారు. అలాగే, ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని ఎలక్టివ్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. అయితే, ఎలక్టివ్ సబ్జెక్టులా తీసుకుంటే తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అదే అదనపు సబ్జెక్టుగా తీసుకుంటే ఉత్తీర్ణత తప్పనిసరి కాదు. ఉతీర్ణులైతే అదనపు మెమో జారీ చేస్తారు. ఇలా చదవడం వల్ల విద్యార్థులు ఎంబైపీసీ చదివినట్లు అవుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. సబ్జెక్టుల విలీనం వల్ల మార్కులు కూడా మారాయి. అలాగే, థియరీ పరీక్షలు రాసేందుకు ఇప్పటి వరకు 24 పేజీల బుక్‌లెట్ ఇస్తుంటే ఇకపై 32 పేజీల బుక్‌లెట్లు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు గణితం ఏ, బీ సబ్జెక్టులు 75 మార్కుల చొప్పున 150 మార్కులకు పరీక్షలు జరిగేవి. కొత్త విధానంలో ఈ ఏడాది 100 మార్కులతోనే పరీక్ష జరుగనుంది. ఫిజిక్స్, కెమిస్ర్టీ, బయాలజీ సబ్జెక్టుల్లో 85 మార్కులతో పరీక్షలు జరుగుతాయి. ఉత్తీర్ణతకు 35శాతం మార్కులు సాధించాలి.
1 నుంచి ప్రాక్టికల్స్
ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, ఆధార్ నంబర్లు, పుట్టిన తేదీలతో http://bie.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే వాట్సా్‌పలో మనమిత్ర-9552300009కు మెసేజ్ చేసి కూడా హాల్‌టికెట్లు తీసుకునే సౌకర్యం ఉందన్నారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు వారి లాగిన్‌ల ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు పంపిణీ చేయొచ్చని తెలిపారు. ఫీజులు, ఇతర కారణాలతో విద్యార్థుల హాల్ టికెట్లను నిలిపివేయరాదని స్పష్టం చేశారు.