Share News

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:14 PM

అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధ్వజపటానికి శాస్త్రోక్తంగా చేస్తున్న పూజధికాలు

నవాహ్నిక దీక్షతో శాసో్త్రక్తంగా పూజలు

యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం

శ్రీశైలం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ అధికారులు, అర్చకులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చతుర్వేదపారాయణలు, వేదస్వస్థి జరిపించారు. లోకకల్యాణార్థం ఆలయంలో బ్రహ్మోత్సవ శివ సంకల్పాన్ని పఠించారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని సకాలంలో తగినన్ని వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని దేశ ప్రజలందరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కాంక్షిస్తూ వేదపండితులు మహాసంకల్పాన్ని పఠించారు. రాత్రి 8:30 గంటలకు సకల పరివార దేవతలను ఆహానిస్తూ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఆలయ ఈఓ శ్రీనివాసరావు దంపతులు, శ్రీశైలం ఆలయ ట్రస్టుబోర్డు అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌ నాయుడు, ప్రధానార్చకులు విజయ్‌, ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాద్యులు, ట్రస్టుబోర్డు సభ్యులు దేవకి వెంకటేశ్వర రావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు సోమవారం బృంగివాహన సేవ నిర్వహిస్తారు.

సకల దేవతలకు ఆహ్వానం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో తొలి రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఉత్సవాల ముఖ్య అధికారి చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఈఓ ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు భేరి పూజలో డోలు వాయిద్యానికి పూజాధికాలు చేశారు. నాదస్వరంతో రాగాలను ఆలపిస్తూ దేవతలను ఆహ్వనించారు. ధ్వజారోహణలో భాగంగా ధ్వజపటాన్ని చండీశ్వరుని సమక్షంలో ధ్వజస్తంభం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజపట ఆవిష్కరణ నిర్వహించారు.

Updated Date - Feb 08 , 2026 | 11:14 PM