Share News

5 సీట్లు, 25 కోట్లు అడిగిన జడ శ్రవణ్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:27 AM

కుల, మత వివాదాలకు దళితులను వాడుకొని వారిని బలిపశువులుగా చేస్తూ.. వారికి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావొద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల..

5 సీట్లు, 25 కోట్లు అడిగిన జడ శ్రవణ్‌

  • తిరస్కరించినందుకే చంద్రబాబుపై విమర్శలు: మహాసేన రాజేశ్‌

కాకినాడ, జూలై 2(ఆంధ్రజ్యోతి): కుల, మత వివాదాలకు దళితులను వాడుకొని వారిని బలిపశువులుగా చేస్తూ.. వారికి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావొద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేశ్‌(మహాసేన రాజేశ్‌) అన్నారు. జడ్జిగా పనిచేశానని చెప్పుకునే జడ శ్రవణ్‌కుమార్‌, యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ వీరిద్దరూ వైసీపీకి పెయిడ్‌ ఆర్టిస్టులుగా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన, టీడీపీ నాయకులతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘జగన్‌ దళితుల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులను తయారుచేయించాడు. వారిలో ఒకరు జడ శ్రవణ్‌కుమార్‌. పవన్‌ కల్యాణ్‌పై ఒక సమావేశంలో అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నాం. వీరందరూ వేరే పేర్లతో సమావేశాలు నిర్వహించి జగన్‌ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. శ్రవణ్‌కుమార్‌ ఒక పార్టీ స్థాపించారు. ఆ పార్టీ ద్వారా సీఎం లేదా ఎమ్మెల్యే అవుతానని చెబితే బాగుండేది. అలాకాకుండా డిప్యూటీ సీఎం అవుతానని చెప్పడం ఏంటి? దళితులు, క్రైస్తవుల సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేసి వాటిలో ఈ పెయిడ్‌ ఆర్టిస్టులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను విమర్శించడం ఏంటి? మా పార్టీ అధినేత చంద్రబాబును, జడ శ్రవణ్‌ ఐదు అసెంబ్లీ సీట్లు, ప్రతి నియోజకవర్గానికి రూ.ఐదు కోట్లు అడిగారు. చంద్రబాబు దానిని తిరస్కరించడంతో ఆయనపై విమర్శలు చేస్తూ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. వీరిపై కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం’ అని రాజేశ్‌ ప్రకటించారు. సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 05:27 AM