Share News

ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:01 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రతి 12ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకూ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం

  • రేపటినుంచి మూడు రోజుల పాటు నిర్వహణ .. 12 నదులు, 3 సముద్రాల జలాలతో క్రతువు

  • రోజుకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా

  • ప్రొటోకాల్‌ దర్శనాలు, అన్ని ఆర్జిత సేవలు రద్దు

  • అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలకు సన్నాహాలు

విజయవాడ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రతి 12ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకూ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6న యాగశాల ప్రవేశం నుంచి క్రతువు మొదలవుతుంది. 8న ఉదయం 9.34 గంటలకు మేష లగ్నంలో కనకదుర్గమ్మ ప్రధానాలయ గోపురానికి 3 సముద్రాలు, 12 పవిత్ర నదుల జలాలను కుంభాలతో తీసుకెళ్లి అభిషేకం చేస్తారు. దీనికోసం ఆరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలతో పాటు కృష్ణా, గోదావరి, గంగా, యమున, కావేరి, పెన్నా, వంశధార, బ్రహ్మపుత్ర తదితర నదుల నుంచి సేకరించిన జలాలు గురువారం రాత్రికి విజయవాడకు చేరుకుంటాయి. వాటిని కుంభాల్లో పోసి యాగశాలలో ఉంచుతారు. చివరి రోజున పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఈ జలాలతో అమ్మవారి ప్రధానాలయ శిఖరాన్ని అభిషేకిస్తారు. ఇందుకోసం ఆలయం చుట్టూ పరంజా ఏర్పాటు చేశారు. పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలను మాత్రమే పరంజాపైకి అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి మొత్తం క్రతువును ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా, కుంభాభిషేకం జరిగే మూడు రోజుల పాటు ప్రొటోకాల్‌ దర్శనాలు రద్దు చేశారు. క్రతువు పూర్తయ్యే వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రూ.500 టికెట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అన్ని క్యూల నుంచి భక్తులు ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు. కుంభాభిషేకానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఘాట్‌రోడ్డులోని ఓం మలుపు నుంచి దర్శనానికి క్యూలైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు సుమారు లక్ష మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభాభిషేకం చివరి రోజు ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.


హాజరుకానున్న ప్రముఖులు

మహాకుంభాభిషేకానికి దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు హాజరుకానున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కుంభాభిషేకం అనంతరం అనుగ్రహ భాషణం చేస్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పలువురు మంత్రులు హాజరవుతారని దేవస్థాన వర్గాలు తెలిపాయి.

గతంలో ఎప్పుడెప్పుడు చేశారంటే...

ఇంద్రకీలాద్రిపై ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభాభిషేకం కచ్చితంగా నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు 2000లో, ఆ తర్వాత 2012లో నిర్వహించా రు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా తూర్పు రాజగోపురం నిర్మాణం పూర్తయిన తర్వాత 2015లో దాని కి మాత్రమే కుంభాభిషేకం చేశారు. ఇప్పుడు ప్రధానాలయానికి మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు.


రెండు విధాలుగా కుంభాభిషేకం

కుంభాభిషేకాన్ని రెండు విధాలుగా నిర్వహిస్తారు. ఇందులో ఒకటి మహాకుంభాభిషేకం. రెండోది సమ్మేళన కుంభాభిషేకం. ఆలయ పునరుద్ధరణ తర్వాత, దైవ చైతన్య పునరుద్ధరణ, భక్తుల శ్రేయస్సు కోసం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభాభిషేకం చేస్తారు. ఆలయంలో మరమ్మతులు, విస్తరణ, గోపుర నిర్మాణం, జీర్ణోద్ధరణ చేసినప్పుడు దేవతా శక్తిని ఆహ్వానించడానికి ఈ క్రతువు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఆలయ గోపురం, విమాన గోపురం, ధ్వజస్తంభం, విగ్రహాలకు పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేస్తారు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రాల్లో జరిగే స్పృశ్య, అస్పృశ్య దోషాలకు పరిహారంగా ఈ క్రతువును నిర్వహిస్తారు. అదేవిధంగా కొన్ని ఆలయాల్లో సమ్మేళన కుంభాభిషేకం చేస్తారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయాలు, గోపురాలు, ధ్వజస్తంభాలకు ఒకేసారి అభిషేకం చేస్తే దాన్ని సమ్మేళన కుంభాభిషేకంగా పేర్కొంటారు. ఆలయ సముదాయం మొత్తాన్ని పునరుద్ధరించినప్పుడు ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలన్నింటిల్లో ఈ క్రతువును నిర్వహిస్తారు.

రేపటినుంచి కంచి పీఠాధిపతి రాష్ట్ర పర్యటన

కంచి కామకోటి పీఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన ఒంగోలుకు చేరుకుంటారు. భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు ప్రయాణమవుతారు. సాయంత్రం 6.30 గంటలకు కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బస చేస్తారు. 7వ తేదీ దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించనున్నారు. 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్థానికంగా మరికొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 9వ తేదీ పొదిలి మండలం ఓబులక్కపల్లి గ్రామంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి పొన్పాడి గ్రామంలో విశ్రాంతి తీసుకుని, 10వ తేదీ ఉదయం కాంచీపురం చేరుకుంటారనీ కామకోటి పీఠం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Mar 05 , 2026 | 04:01 AM