Share News

మల్లన్న దర్శనంలో సామాన్యులకే ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 03 , 2026 | 04:44 AM

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పిలుపునిచ్చారు.

మల్లన్న దర్శనంలో సామాన్యులకే ప్రాధాన్యం

  • టైంస్లాట్‌లలోనే వీఐపీలకు దర్శనం

  • శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

శ్రీశైలం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పిలుపునిచ్చారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు. సోమవారం శ్రీశైలంలోని సదాశివయ్య భవన్‌లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ, జిల్లా అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సామాన్య భక్తులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ స్వామిఅమ్మవార్ల సర్వ దర్శనాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని దేవదాయ శాఖ ఎక్స్‌ అఫిషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏర్పాట్లలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలని.. భక్తులందరికీ సజావుగా, సంతృప్తికరంగా దైవ దర్శనం కల్పించినపుడే ప్రభుత్వ చర్యలు విజయవంతమవుతాయని పేర్కొనన్నారు. వీఐపీ దర్శనాలకు వచ్చే వారు టైంస్లాట్‌ను రచ్చితంగా అనుసరించేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అనిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. భక్తుల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ తగిన మౌలిక వసతులు కల్పించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్ధన్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

Updated Date - Feb 03 , 2026 | 04:45 AM