Share News

ఇంద్రకీలాద్రిపై ‘మహా’ సందడి

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:16 AM

ఇంద్రకీలాద్రిపై మరో ఐదు రోజుల్లో మహా కుంభాభిషే సందడి ప్రారంభం కాబోతోంది. ప్రతి ఆలయంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కుంభాభిషేకాన్ని ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించాలని పండితులు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రిపై ఇప్పటి వరకు 12 ఏళ్లకు ఒకసారి ఈ క్రతువును నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై ‘మహా’ సందడి

6 నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం

8వ తేదీ వరకు జరగనున్న పవిత్ర క్రతువు

భక్తుల కోసం ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు

రోజుకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా

మహాకుంభాభిషేకం రోజున పెరుగుతారని లెక్క

ఓం మలుపు నుంచి క్యూలైన్లు

మూడు రోజులు ఉచిత దర్శనాలు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ/ఇంద్రకీలాద్రి):

ఇంద్రకీలాద్రిపై మరో ఐదు రోజుల్లో మహా కుంభాభిషే సందడి ప్రారంభం కాబోతోంది. ప్రతి ఆలయంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కుంభాభిషేకాన్ని ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించాలని పండితులు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రిపై ఇప్పటి వరకు 12 ఏళ్లకు ఒకసారి ఈ క్రతువును నిర్వహించారు. ఈసారి మాత్రం 13వ ఏట నిర్వహిస్తున్నారు. ఇంద్రలాద్రిపైన, కింద వివిధ నిర్మాణపు పనుల కారణంగా ఒక ఏడాది ఆలస్యమైంది. ఆగమశాస్ర్తాల ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలని ఉన్నప్పటికీ ఒక ఏడాది ఆలస్యంగా చేయడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవని పండితులు పేర్కొంటున్నారు. కుంభాభిషేక క్రతువు ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మహాకుంభాభిషేకం మూడు పవిత్ర దినాల్లో నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కుంభాభిషేకం క్రతువు శుక్రవారం ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుంది. చివరి రోజున కనకదుర్గమ్మ ప్రధానాలయం గోపురానికి పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేస్తారు. యాగశాలలో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత కుంభాభిషేకం చేస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కుంభాభిషేకాన్ని వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి మొత్తం క్రతువును ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ప్రధానాలయం చుట్టూ పరంజామా ఏర్పాటు చేస్తారు. పండితులు దాని పైనుంచి గోపుర శిఖరానికి కుంభాలతో అభిషేకం చేస్తారు. దీన్ని దగ్గర నుంచి భక్తులు వీక్షించే ఆస్కారం ఉండదు. మొదటి రోజున జరిగే యాగశాల ప్రవేశం దగ్గర నుంచి కుంభాభిషేకం పూర్తయ్యే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల భక్తులకు సంతృప్తి కలుగుతుందన్న భావనలో అధికారులు ఉన్నారు.

నో వీఐపీ సేవలు!

కుంభాభిషేకం జరిగే మూడు రోజులపాటు ఎలాంటి ప్రొటోకాల్‌ దర్శనాలు ఉండవు. క్రతువు పూర్తయ్యే వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతోపాటు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రూ.500 టికెట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అన్ని క్యూల నుంచి భక్తులు ఉచితంగా ప్రవేశించవచ్చు. కుంభాభిషేకానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఘాట్‌రోడ్డులోని ఓం మలుపు నుంచి క్యూలైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు లక్ష మంది భక్తులు 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ ఘట్టాన్ని తిలకించడానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభాభిషేకం చివరి రోజు ఆదివారం నాడు ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన ఈవో

ఆలయంలో జరుగుతున్న పనులను ఆదివారం క్ష్షేత్రస్థాయిలో ఈవో వి.కె.శీనానాయక్‌ పరిశీలించారు. స్థానాచార్యడు శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఉప ప్రధాన అర్చకుడు శాండిల్య, వేదపండితులు షణ్ముఖ శాసి్త్రతో కలిసి విమాన గోపురం ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంజనీరింగ్‌ విభాగం ఈఈ రమ, డీఈ అశోక్‌, ఇంజనీరింగ్‌ సిబ్బందితో భక్తుల సౌకర్యాల గురించి చర్చించారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు ప్రసాద వితరణలో ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. 8వ తేదీ ఉదయం 9.34 గంటలకు మేష లగ్నంలో ప్రధాన కుంభాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతి శంకరజయేంద్ర సరస్వతి మార్గదర్శకాల మేరకు శాసో్త్రక్తంగా నిర్వహించనున్నారు.

కుంభాభిషేకం ఎన్ని రకాలంటే..

కుంభాభిషేకం రెండు విధాలుగా నిర్వహిస్తారు. ఇందులో ఒకటి మహాకుంభాభిషేకం. రెండోది సమ్మేళన కుంభాభిషేకం. మహాకుంభాభిషేకాన్ని ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. దీన్ని ఆలయ పునరుద్ధరణ తర్వాత, దైవ చైతన్య పునరుద్ధరణ, భక్తుల శ్రేయస్సు కోసం చేస్తారు. ఆలయంలో మరమ్మతులు, విస్తరణ, గోపుర నిర్మాణం, జీర్ణోద్ధరణ చేసినప్పుడు దేవతా శక్తిని ఆహ్వానించడానికి మహాకుంభాభిషేకం చేస్తారు. ఆలయ గోపురం, విమాన గోపురం, ధ్వజస్తంభం, విగ్రహాలకు పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేస్తారు. ఈ కుంభాభిషేకాన్ని సాధారణంగా 3-12 రోజులపాటు నిర్వహిస్తారు. మహాకుంభాభిషేకం ఆలయానికి ఒక పునర్జన్మ వంటిదని ఆగమ పండితులు భావిస్తారు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రాల్లో స్పృశ్య, అస్పృశ్య దోషాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటికి పరిహారంగా ఈ క్రతువును నిర్వహిస్తారు. అదేవిధంగా కొన్ని ఆలయాల్లో సమ్మేళన కుంభాభిషేకం చేస్తారు. ఒక ప్రాంగణంలో ఉన్న ఆలయాలకు, గోపురాలకు, ధ్వజస్తంభాలకు ఒకేసారి అభిషేకం చేస్తే దాన్ని సమ్మేళన కుంభాభిషేకంగా పేర్కొంటారు. ఆలయ సముదాయం మొత్తాన్ని పునరుద్ధరించినప్పుడు, అనుబంధ దేవతల సన్నిధిలన్నింటిలో ఒకేసారి శక్తి ఆవాహన చేయాలనుకున్నప్పుడు ఈ సమ్మేళన కుంభాభిషేకం చేస్తారు. ఇందులో ప్రధాన దేవాలయంతోపాటు ఉపాలయాలన్నింటిల్లోను ఈ క్రతువును నిర్వహిస్తారు.

Updated Date - Mar 02 , 2026 | 01:16 AM