Share News

చిట్టితల్లిని చిదిమేశాడు!

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:33 AM

గంజాయి మత్తులో మునిగిన ఓ మానవమృగం ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా హతమార్చింది.

చిట్టితల్లిని చిదిమేశాడు!

  • గంజాయి మత్తులో ఓ మానవ మృగం ఘాతుకం

  • ఏడేళ్ల బాలికను హింసించి, హత్యాచారం

  • మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో చుట్టిపెట్టి మత్తులోకి

  • నిందితుడ్ని అప్పగించాలంటూ స్థానికుల ఆందోళన

  • మదనపల్లెలో తీవ్ర ఉద్రిక్తత.. కఠినంగా శిక్షిస్తామని మంత్రులు లోకేశ్‌, అనిత హామీ

మదనపల్లె, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): గంజాయి మత్తులో మునిగిన ఓ మానవమృగం ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా హతమార్చింది. ఈ అమానవీయ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన బాలిక(7) స్థానికంగా ఓ ప్రవేట్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మహాశివరాత్రి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. గంజాయికి, మద్యానికి బానిసై జులాయిగా తిరిగే కులవర్ధన్‌(30) వీరి ఎదురింటి బయట కూర్చున్నాడు. అప్పటికే మత్తులో ఉన్న అతను ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. సాయంత్రం బాలిక ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నిందితుడు.. ఆ చిట్టితల్లిపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో మృతదేహాన్ని చుట్టిపెట్టి మత్తులోకి జారుకున్నాడు. మంగళవారం ఉదయం పోలీసులు జాగిలాలతో ఆ ప్రాంతాన్ని గాలించారు. అవి కులవర్ధన్‌ ఇంటి ముందుకు వెళ్లి ఆగడంతో అనుమానించిన పోలీసులు గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించాడు. డ్రమ్ములో ఉంచిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులతో పాటు చేనేతలు, కుల, ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.


మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్‌తో వచ్చిన పోలీసులను చుట్టుముట్టారు. నిందితుడిని తమకు అప్పగించే వరకూ మృతదేహాన్ని ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. బాలికతో పాటే వాడికీ అంత్యక్రియలు చేయాలని, ప్రజాకోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారుల సంఖ్య క్రమంగా పెరగడంతో నీరుగట్టువారిపల్లె, కాట్లాటవారిపల్లె రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కడప ఎస్పీ నికసిత్‌ విశ్వనాథ్‌, సబ్‌కలెక్టర్‌ చల్లా కల్యాణి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జి. శ్రీరామ్‌చినబాబు తదితరులు బాలిక తల్లితండ్రులతో చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని, నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌ ఫోన్‌లో హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఆపై హత్య చేశాడని డీఐజీ కోయ ప్రవీణ్‌ నిర్ధారించారు. కాగా, మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 18 , 2026 | 05:34 AM