మాచినేని ‘రియల్’ మోసాలు
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:56 AM
పన్నెండేళ్ల క్రితమే.. 27 ఎకరాల్లో 300 ప్లాట్లు వేసి విక్రయించేశారు. ఇల్లు కట్టుకోవచ్చన్న ఆశతో మధ్యతరగతి కుటుంబాల వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేశారు.
పన్నెండేళ్లయినా ఒక్కరూ ఇల్లు కట్టుకోలేని పరిస్థితి
రోడ్లు, డ్రైన్లు, నీటి వసతి కల్పించడంలో విఫలం
వేంపాడులో 300 ప్లాట్లదారుల భవితవ్యం ప్రశ్నార్థకం
వెలుగులోకి ఆదిత్య హౌసింగ్ లిమిటెడ్ మోసాలు
(ఏలూరు-ఆంధ్రజ్యోతి)
పన్నెండేళ్ల క్రితమే.. 27 ఎకరాల్లో 300 ప్లాట్లు వేసి విక్రయించేశారు. ఇల్లు కట్టుకోవచ్చన్న ఆశతో మధ్యతరగతి కుటుంబాల వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్లాట్లన్నీ అమ్ముకున్న తర్వాత ఆ సంస్థ కనీస సౌకర్యాలు కల్పించకుండా చేతులెత్తేసింది. దీంతో పుష్కర కాలం దాటినా ఈ 300 ప్లాట్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం కాలేదు. దీంతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని సొంతిల్లు నిర్మించుకోవాలని కలలుగన్న వారి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో పలువుర్ని మోసం చేసిన శ్రీ ఆదిత్య ఇన్‌ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మాచినేని కోటేశ్వరావు మోసాలు ఇటీవల బయటపడడంతో... ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వేంపాడులో ఆ సంస్థ నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారి భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వేంపాడు పరిధిలో సర్వే నంబర్ 234లో 27.46 ఎకరాలను 2014లో శ్రీ ఆదిత్య ఇన్‌ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మాచినేని కోటేశ్వరరావు... 200, 294, 400 గజాల కింద విభజించి 300కు పైగా ప్లాట్లు వేసి విక్రయించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ పేరుతో ఫేక్ రిజిస్ర్టేషన్లు చేపట్టిన ఉదంతంలో విజయవాడలోని పటమట పోలీసులు ఇటీవల ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆయనపై 22 కేసులను నమోదు చేశారు. దీంతో వేంపాడులో ఆయన వద్ద ప్లాట్లు కొనుగోలు చేసినవారిలో గుబులు రేగుతోంది. ఇదిలా ఉండగా ఈ స్థలంలోనే రెండు ఎకరాల వరకు నయారా పెట్రోల్ బంకుకు మాచినేని విక్రయించినట్టు సమాచారం.
కనీస సౌకర్యాలు లేక .. ఇంటి నిర్మాణం చేపట్టక
శ్రీ ఆదిత్య కింగ్స్ టౌన్ వెంచర్ పేరిట వేసిన ఈ వెంచర్‌లో 12 ఏళ్ల నుంచి ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరగలేదు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. మొక్కుబడిగా ప్రధాన ప్లాట్లకు వెళ్లేందుకు రోడ్డు వేశారు. కానీ చివర ప్లాట్లను పట్టించుకోలేదు. విద్యుత్ సౌకర్యానికి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయలేదు. ఈ వెంచర్ చుట్టుపక్కల ఇటీవల కాలంలో కార్నర్ స్టోన్ విల్లాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. ఆదిత్య ప్లాట్స్ పరిసరాలు మాత్రం అడవిని తలపిస్తున్నాయి. వాస్తవంగా అయితే రియల్టర్ అనుమతి పొందిన ప్రతి లే-అవుట్‌కు ప్రవేశ మార్గం, 60 అడుగులు వెడల్పున ప్రధాన రహదారి ఉండాలి. అంతర్గత రోడ్లతో పాటు ప్లాట్ల మధ్యన రోడ్లు తప్పనిసరి. డ్రెయినేజీ వ్యవస్థ పక్కాగా ఉండాలి. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు స్ర్టామ్ వాటర్ డ్రెయినేజీతో పాటు మురుగునీటి కోసం యూజీడీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అవేవి లేకపోవడంతో ఈ ప్లాట్లన్నీ నిరుపయోగంగా మారాయి. కాగా, వేంపాడులో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ఇడా (ఏలూరు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ) పరిధిలోకి రాలేదని ఇడా ప్లానింగ్ అధికారి సుధాకర్ తెలిపారు. బాధితులెవరైనా మమ్మల్ని సంప్రదించి ఫిర్యాదు చేస్తే.. చర్యలకు సిఫార్సు చేయడానికి వీలుంటుందని చెప్పారు.