Share News

Lucky Draw Scam: లక్కీడ్రా పేరుతో టీటీడీ ఎదుట ప్రచారాలు

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:55 AM

లక్కీడ్రా ప్రమోషన్‌ కోసం ఇద్దరు యువకులు ఏకంగా హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆలయాన్ని ఎంచుకున్నారు.

Lucky Draw Scam: లక్కీడ్రా పేరుతో టీటీడీ ఎదుట ప్రచారాలు

  • ఇద్దరు యువకులపై కేసు నమోదు

పంజాగుట్ట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): లక్కీడ్రా ప్రమోషన్‌ కోసం ఇద్దరు యువకులు ఏకంగా హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాన్ని ఎంచుకున్నారు. రూ.399 చెల్లిస్తే లక్కీడ్రా తీసి హ్యుందాయ్‌ ఐ20 కారు, ఐఫోన్‌, టీవీ, బైక్‌ ఇస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మేరకు శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపకురాలు పడాల కల్యాణి అలియాస్‌ కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌ క్యాస, సిద్ధమోని నరేందర్‌ అనే యు వకులకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉండడంతో వారు ఎటువంటి అనుమతులు లేకుండా తమ ఖాతాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వారు చెప్పిన ఖాతాలకు, ఫోన్‌ నంబర్లకు రూ.399 పంపిస్తే లక్కీడ్రా తీస్తామని, అందులో గెలిచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. తమపై నమ్మకం కలగడానికి తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమోషన్‌ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. లక్కీడ్రా పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపారు.

Updated Date - Jan 19 , 2026 | 04:55 AM