రాష్ట్రంలో ‘వాణిజ్య గ్యాస్’ వెతలు!
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:17 AM
వంట గ్యాస్(ఎల్‌పీజీ) సరఫరాపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గృహ అవసరాలకు ఇబ్బంది లేకపోయినా.. వాణిజ్య సిలిండర్ల సరఫరాలో మాత్రం కోత విధిస్తున్నారు. దీంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.
కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్
రూ.2,050 సిలిండరు ఏకంగా 3 వేలు
హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకుల బెంబేలు
ఇలాగైతే హోటళ్లను నడపలేం: సంఘాలు
డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్ చేస్తున్నారని ఆరోపణ
ఇంటి అవసరాలకు ఇబ్బంది లేదు: మంత్రి
వదంతులు నమ్మొద్దు.. మనోహర్ విజ్ఞప్తి
అమరావతి/విశాఖపట్నం/తెనాలి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్(ఎల్‌పీజీ) సరఫరాపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గృహ అవసరాలకు ఇబ్బంది లేకపోయినా.. వాణిజ్య సిలిండర్ల సరఫరాలో మాత్రం కోత విధిస్తున్నారు. దీంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడిపే చిరువ్యాపారులు రోజుకు 5 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటారు. నిన్న మొన్నటి వరకు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం డీలర్లు సగానికి సగం తగ్గించి సరఫరా చేస్తున్నారు. ఇక, ఇదే సమయం అన్నట్టు కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారు. ఒక్కో వాణిజ్య సిలిండరు ధర ప్రస్తుతం రూ.2,050లోపు పలుకుతుండగా.. బ్లాక్ మార్కెట్‌లో రూ.2,800 నుంచి రూ.3 వేల వరకు అమ్ముతున్నారని హోటల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించి.. అవసరమైన మేరకు సిలిండర్లను సరఫరా చేయకపోతే వ్యాపారాలు చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్ర స్టార్ హోటళ్ల సంఘం, విజయవాడలోని హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల హోటళ్లు, రెస్టారెంట్ల పరిశ్రమ సంక్షోభంలో పడిందని, హోటళ్లను నడపడం అసాధ్యంగా మారుతోందని ఆవేదన వెలిబుచ్చారు.
అంతా డిస్ట్రిబ్యూటర్లే: సంఘం
వాణిజ్య సిలిండర్ల సరఫరాలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు సృష్టిస్తున్నారని స్టార్ హోటళ్ల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ.. బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ ధరలు పెరగడంతో టిఫిన్లు, భోజనాల ధరలు పెంచాల్సి వస్తోందన్నారు.
ప్రత్యేక నిఘా: మంత్రి
రాష్ట్రంలో వంట గ్యాస్‌కు కొరత లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల అక్రమ తరలింపు, బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించామన్నారు. ‘‘హెచ్‌పీసీఎల్, విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే పైపులైను, విశాఖలోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీల ద్వారా జరుగుతున్న సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రోజువారీ అవసరాలలో ఏచిన్న తేడా వచ్చినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. కమర్షియల్ గ్యాస్ గ్యాస్ కొరత అంటూ వదంతులు పుట్టించినా, ఇష్టానుసారం ధరలు పెంచినా కఠిన చర్యలు తీసుకోవాలి.’’ అని అధికారులకు మంత్రి మనోహర్ దిశానిర్దేశం చేశారు.
స్టీల్ ప్లాంటుకు ‘గ్యాస్’ కష్టాలు
సరఫరా చేయలేమన్న ఐఓసీఎల్
విశాఖ స్టీల్ ప్లాంటుకు యుద్ధం సెగ తగిలింది. ఈ స్టీల్ ప్లాంటు రోజుకు 13 టన్నుల ఎల్‌పీజీని ఉపయోగిస్తుంది. స్టీల్ మెల్టింగ్ షాప్(ఎ్‌సఎంఎ్‌స)లో తయారైన స్టీల్‌ను కట్ చేయడానికి ఎల్‌పీజీని వినియోగిస్తారు. దీనికి ప్రత్యామ్నా యం లేదు. కటింగ్ ఆపితే మొత్తం ప్లాంటులో ఉత్పత్తి ఆగిపోతుంది. ప్లాంటులో 325 టన్నుల సామర్థ్యం ఉన్న ఎల్‌పీజీని నిల్వ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే, దీనిలో ప్రస్తుతం 156 టన్నులు మాత్ర మే ఉంది. మరో పది రోజులకు మాత్రమే ఆ నిల్వలు సరిపోతాయని స్టీల్ అధికారుల సంఘం తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంటుకు ఎల్‌పీజీని సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్).. కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు ఎల్‌పీజీ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు మెయిల్ చేసింది. దీంతో ప్లాంట్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే వారు ఈ విషయాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ దృష్టికి తీసుకువెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ శ్రీభరత్.. ఢిల్లీలోని పెట్రోలియం శాఖ అధికారులతో మాట్లాడి, స్టీల్ ప్లాంటుకు ఎల్‌పీజీని ఆపితే ఇబ్బందులు వస్తాయని, సరఫరా కొనసాగించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.