నాసిరకం... తినేదెవరు?
ABN , Publish Date - May 12 , 2026 | 04:57 AM
రేషన్ షాపుల్లో రాయితీపై దాదాపు సగం ధరకే ఇస్తున్న గోధుమ పిండి నాసిరకంగా ఉంటోందని నిరసన వ్యక్తమవుతోంది. ఈ గోధుమ పిండి మైదాలా ఉంటోందంటూ, దానిని తీసుకునేందుకు కార్డుదారులు ముందుకు రావడం లేదు.
రేషన్ షాపుల్లో నాసిరకం గోధుమపిండి.. సగం ధరకే వస్తున్నా తీసుకోని కార్డుదారులు
నిల్వ ఉంటే పాడైపోతున్న ప్యాకెట్లు
అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న డీలర్లు
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): రేషన్ షాపుల్లో రాయితీపై దాదాపు సగం ధరకే ఇస్తున్న గోధుమ పిండి నాసిరకంగా ఉంటోందని నిరసన వ్యక్తమవుతోంది. ఈ గోధుమ పిండి మైదాలా ఉంటోందంటూ, దానిని తీసుకునేందుకు కార్డుదారులు ముందుకు రావడం లేదు. రూ.లక్షలు డీడీలు కట్టి తెస్తున్న గోధుమ పిండిని నాణ్యత లేదని కార్డుదారులు తిరస్కరిస్తుండటంతో.. ప్యాకెట్లు రేషన్ షాపుల్లో నిల్వ ఉండి పాడైపోతున్నాయని డీలర్లు వాపోతున్నారు. అలాగని మరుసటి నెల డీడీలు తీయడం మానేస్తే అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోధుమ పిండి ప్యాకెట్లను హోటళ్లకు, చిరువ్యాపారులకు అమ్మేసుకుని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పేదలకు పోషకాహారం అందించాలని!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సరఫరాల వ్యవస్థను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కువమంది చపాతీలు, పుల్కాలు, రోటీలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా జాతీయ ఆహార భద్రత పథకం కింద రాష్ట్రానికి నెలకు 1,838 టన్నుల చొప్పున గోధుమలు కేటాయిస్తోంది. కానీ గత ఐదేళ్లూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న గోధుమలు తీసుకోలేదు. రేషన్‌కార్డుదారులకు సరఫరా చేయలేదు. దీంతో గత ఐదేళ్లూ రాష్ట్రానికి రావాల్సిన గోధుమలు వృథాగా పోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో.. కేంద్రం ఇస్తున్న గోధుమలు తీసుకుని, దానిని పోషక విలువలతో కూడిన నాణ్యమైన చక్కీ గోధుమ పిండిగా మార్చి, ఒక కేజీ ప్యాకెట్లలో రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి నుంచి రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు రాయితీపై గోధుమ పిండి అందిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో గోధుమ పిండి ధర.. నాణ్యత, రకాలను బట్టి కిలో రూ.40 నుంచి రూ.80 వరకూ ఉండగా, ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న గోధుమపిండి కిలో రూ.20 మాత్రమే. కార్డుదారుల ఆసక్తి, డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా రాయితీ గోధుమ పిండిని సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది.
టెండరు లేకుండానే కట్టబెట్టారు!
రేషన్ కార్డుదారులకు నాణ్యమైన గోధుమ పిండిని సరఫరా చేసే విషయంలో పౌర సరఫరాల సంస్థ చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా కేటాయించే ముడి గోధుమలు తీసుకుని, వాటిని మర పట్టించి.. నాణ్యమైన గోధుమ పిండిని ఒక కిలో ప్యాకెట్లుగా అందించే బాధ్యత రాష్ట్ర పౌర సరఫరాల సంస్థదే. ఇందుకు మిల్లర్ కమ్ సప్లయర్స్ (రోలర్ మిల్స్) నుంచి టెండర్లు ఆహ్వానించి, ఎల్1గా నిలిచిన సంస్థకు గోధుమ పిండి సరఫరా బాధ్యతలు అప్పగించాలి. కానీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆ బాధ్యతను కేంద్ర ఆధీనంలో పనిచేసే నోడల్ ఏజెన్సీకి అప్పగించేసి చేతులు దులుపుకుంది. ఆ నోడల్ ఏజెన్సీ కూడా ఎలాంటి టెండరు ప్రక్రియ లేకుండా తమ దగ్గర ఎంప్యానల్ అయిన కాకినాడ, విజయనగరం జిల్లాలకు చెందిన రెండు కంపెనీలకు గోధుమల మిల్లింగ్, ప్యాకింగ్ బాధ్యతలను అప్పగించింది. ఆ కంపెనీలు నాణ్యత లేని గోధుమ పిండిని సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోధుమ పిండి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. గోధుమ పిండి మైదాలా ఉండి.. వాసన వస్తోందని చెబుతున్నారు. అదే అధికారులు టెండర్లు పిలిచి ఉంటే.. మిల్లర్ల మధ్య పోటీ ఏర్పడి గోధుమల మిల్లింగ్, ప్యాకింగ్ ఖర్చులు తగ్గడంతోపాటు నాణ్యమైన గోధుమ పిండిని పేదలకు అందించే అవకాశం ఉండేదని అంటున్నారు.