Share News

‘ప్రియుడి’ భార్య, కుమారుడు, తల్లికి నిప్పు.. గుంటూరు జిల్లాలో ఘోరం

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:03 AM

వివాహేతర సంబంధం కారణంగా ఏర్పడిన వివాదంతో ఓ యువతి తన ప్రియుడి ఇంటి మీద పెట్రోలుతో దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది వరకు గాయపడ్డారు.

‘ప్రియుడి’ భార్య, కుమారుడు, తల్లికి నిప్పు.. గుంటూరు జిల్లాలో ఘోరం

  • వివాహేతర సంబంధంలో వివాదం

  • మొత్తం 10 మందికి గాయాలు.. గుంటూరు జిల్లాలో ఘటన

చేబ్రోలు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం కారణంగా ఏర్పడిన వివాదంతో ఓ యువతి తన ప్రియుడి ఇంటి మీద పెట్రోలుతో దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది వరకు గాయపడ్డారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన ఆలంకుంట మల్లేశ్‌కు, తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గ అనే యువతికి మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇటీవల ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో తెనాలిలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి విఫలమయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన దుర్గ.. పెట్రోలు క్యాన్‌తో సుద్ధపల్లిలోని మల్లేశ్‌ ఇంటికి శనివారం రాత్రి చేరుకుంది. ఆ సమయంలో మల్లేశ్‌ ఇంట్లో లేకపోవడంతో అక్కడే ఉన్న మల్లేశ్‌ భార్య అర్చన, తల్లి పద్మ, కుమారుడు అరుణ్‌పై పెట్రోలు పోసింది. అంతటితో ఆగకుండా ఇంటి మీద కూడా పెట్రోలు చల్లి నిప్పంటించింది. ఈ సమయంలో దుర్గపై కూడా పెట్రోలు పడటంతో ఆమెతో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకుప్రయత్నించగా, వారిలో ఆరుగురికి కూడా గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:05 AM