Share News

కృష్ణా పూదోటలో విరిసిన పద్మాలు

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:54 AM

ఉమ్మడి కృష్ణాజిల్లా పూదోటలో పద్మాలు విరబూశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలు మూడు మనకే దక్కటం పట్ల అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలకు చెందిన ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్‌ అవార్డు వరించగా, గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరుకు చెందిన వె ంపటి కుటుంబశాసి్త్రకి, విజయవాడలోని పటమటలంకకు చెందిన నటుడు రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

కృష్ణా పూదోటలో విరిసిన పద్మాలు

- ఉమ్మడి కృష్ణాకు మూడు ప్రతిష్టాత్మక పురస్కారాలు

- నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్‌ అవార్డు

- వెంపటి కుటుంబశాసి్త్ర, రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ

- కృష్ణాకు రెండు, ఎన్టీఆర్‌కు ఒక పురస్కారంపై అంతటా హర్షం

- పురస్కార గ్రహీతల స్వస్థలాల్లో ఆనందోత్సహాలు

ఉమ్మడి కృష్ణాజిల్లా పూదోటలో పద్మాలు విరబూశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలు మూడు మనకే దక్కటం పట్ల అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలకు చెందిన ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్‌ అవార్డు వరించగా, గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరుకు చెందిన వె ంపటి కుటుంబశాసి్త్రకి, విజయవాడలోని పటమటలంకకు చెందిన నటుడు రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

‘కృష్ణా’ దత్తపుత్రుడు నోరి దత్తాత్రేయుడు

- పమిడిముక్కల మండలం తాడంకి స్వస్థలం

మచిలీపట్నం టౌన్‌/పమిడిముక్కల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో సత్యనారాయణ, కనకదుర్గమ్మ దంపతులకు ఆయన జన్మించారు. వారికి దత్తాత్రేయుడు 12వ సంతానం. తండ్రి నోరి సత్యనారాయణ తాడంకి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత సత్యనారాయణకు బదిలీ కావటంతో తోట్లవల్లూరు మండలానికి వెళ్లిపోయారు. దత్తాత్రేయ భార్య సుభద్ర కూడా డాక్టర్‌. వీరి కుమారుడు సతీష్‌ న్యాయవాది. కుమార్తె ప్రియ వైద్యురాలు. ఆయనకు బందరుతో విడదీయరాని బంధం ఉంది. మచిలీపట్నం వచ్చినప్పుడల్లా రాజుపేటలో తన సోదరి ఇందిర, బావ ఎల్‌ఎస్‌ శాసి్త్ర ఇంటికి తప్పనిసరిగా వస్తారు. వారి ఇంట్లోనే కేన్సర్‌ రోగులకు వైద్య పరీక్షలు చేస్తారు.

నేపథ్యం ఇదీ..

నోరి దత్తాత్రేయుడు ప్రాథమిక విద్యను మచిలీపట్నంలోని సర్కిల్‌పేట పాఠశాల, జె బ్రాంచ్‌ పాఠశాల, పొట్టి పిచ్చయ్య పాఠశాలలో చదివారు. 6 నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు జైహింద్‌ హైస్కూల్‌లో చదివారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో పీయూసీ, బీఎస్సీ అభ్యసించారు. అనంతరం కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేశారు. నాటి సీఎం ఎన్‌టీ రామారావు సతీమణి బసవతారకం కేన్సర్‌ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అనంతరం కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ప్రతిభ ప్రదర్శించారు. గతంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న నోరి దత్తాత్రేయుడు ఇప్పుడు పద్మవిభూషణ్‌ అందుకోనున్నారు.

కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగాడు

బాల్యం నుంచి దత్తాత్రేయుడు కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నారు. నిరంతరం పరిశోధనలపై వెళ్లేవారు. కేన్సర్‌ సోకిన వారిని రక్షించడం తన పరమావధిగా ఎంచుకున్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటున్న ఆయనకు అమరావతి కేంద్రంగా కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాలనే కోరిక ఉంది. బసవతారకం కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకుడు నందమూరి బాలకృష్ణను ఎంతో అభిమానిస్తారు. బందరు వచ్చినప్పుడు ఆయన స్నేహితులు, బంధువులతో గడుపుతారు. ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారం రావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆనందదాయకం.

- దత్తాత్రేయుడు సోదరి ఇందిర

పాండిత్యానికి పురస్కారం

- వెంపటి కుటుంబశాసి్త్ర జన్మస్థలం గుడ్లవల్లేరు

మచిలీపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరుకు చెందిన వె ంపటి కుటుంబశాసి్త్రకి పద్మశ్రీ అవార్డు దక్కింది. వెంపటి జగన్నాథం, రాజ్యలక్ష్మి దంపతులకు 1950, ఆగస్టు 12న ఆయన జన్మించారు. సంస్కృత పండితుడిగా పేరొందిన ఆయన.. తిరుపతిలోని ఎస్వీ వేద పాఠశాలలో రుగ్వేదం చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యాప్రవీణ (ఎంఏ) పూర్తిచేశారు. న్యూఢిల్లీలోని రాష్ర్టీయ సంస్కృత సంస్థాన్‌లో పీహెచ్‌డీ చేశారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో ఎంఏ, పీజీ డిప్లొమా యోగా కోర్సును చదివారు. మహారాష్ట్ర రామ్‌టెక్‌లోని కవిగురు కాళిదాస సంస్కృతి యూనివర్సిటీ నుంచి, బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థానం నుంచి డీలిట్‌ను అందుకున్నారు. అద్వైత వేదాంతం, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్య రంగాల్లో ప్రసిద్ధికెక్కారు.

నేపథ్యం ఇదీ..

పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం చిట్టిగూడూరులోని శ్రీనరసింహ సంస్కృత కళాశాలలో 1874-1878 వరకు వెంపటి కుటుంబశాసి్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. ఢిల్లీలోని మధ్యరాష్ర్టీయ సంస్కృతి సంస్థాన్‌ ఆధ్వర్యంలో నడిచే పూరి, తిరుపతి విద్యాపీఠాల్లో అధ్యాపకుడిగా 1978-1987 మధ్య పనిచేశారు. 1987-1990 వరకు తిరుపతి విద్యాపీఠంలో రీడర్‌గా, 1990 నుంచి కొన్నేళ్లపాటు పుదుచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో సంస్కృత విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు. న్యూఢిల్లీలోని రాష్ర్టీయ సంస్కృత సంస్థాన్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ వీసీగా 2003-2008 వరకు, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వీసీగా 2008-2011 వరకు పనిచేశారు. 2015 నుంచి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ డైరెక్టర్‌గా సుదర్ఘీకాలం సేవలందించారు. సంస్కృతంలో పలు రచనలు చేయడంతో పాటు గ్రంథాలను అనువదించారు. 2014లో కామకోటి పీఠాధిపతుల నుంచి వేదాంత విశారద బిరుదును అందుకున్నారు. అమెరికా, నేపాల్‌, ఫిన్లాండ్‌, ఽథాయిలాండ్‌, స్కాట్లాండ్‌ తదితర దేశాల్లో జరిగిన సంస్కృత పరిశోధ నా సదస్సుల్లో పలు పత్రాలను ఆయన సమర్పించారు. గుడ్లవల్లేరులో జన్మించిన ఆయన 48 ఏళ్లుగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు.

‘నవ్వు’కు నజరానా

- నటుడు రాజేంద్రప్రసాద్‌ విజయవాడకు చెందినవారే

(ఆంధ్రజ్యోతి-విజయవాడ కల్చరల్‌) : నవ్వుకు కేంద్రం నజరానా ఇచ్చింది. విజయవాడకు చెందిన గద్దె బాబూరాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. నవ్వును కేవలం వినోదంగా కాకుండా జీవన సందేశంగా మలిచిన నటుడిగా రాజేంద్రప్రసాద్‌కు గుర్తింపు ఉంది. ఆయన పటమటలంకలో 1955, ఏప్రిల్‌ 15న జన్మించారు. తండ్రి గద్దె వెంకట నారాయణ, తల్లి గద్దె మాణిక్యాంబ. సిరామిక్‌ ఇంజనీరింగ్‌లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన రాజేంద్రప్రసాద్‌ నటనపై ఉన్న ఆసక్తితో ఫిల్మ్‌ యాక్టింగ్‌ కోర్సులో చేరి బంగారు పతకం సాధించారు. ప్రత్యేక మూకాభినయం ఆయన ప్రతిభకు నిదర్శనం. 1977లో బాపు దర్శకత్వం వహించిన ‘స్నేహం’ చిత్రం ద్వారా నటనలోకి అడుగుపెట్టారు. 1985లో ‘ప్రేమించు పెళ్లాడు’ చిత్రంతో కథానాయకుడిగా మారారు. 1986లో విడుదలైన లేడీస్‌ టైలర్‌ చిత్రం ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. 1987లో ఒకే ఏడాదిలో 21 సినిమాల్లో హీరోగా నటించి తెలుగు చిత్రసీమలో రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు. రాజేంద్రప్రసాద్‌ 48 ఏళ్ల సినీ ప్రస్థానంలో 294 చిత్రాల్లో నటించారు. ఆయన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో నటించారు.

అంతర్జాతీయి స్థాయికి హాస్యం

2009లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘క్విక్‌ గన మురుగన’ రాజేంద్రప్రసాద్‌ ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆయన చిత్రాల్లో సామాజిక దృక్కోణం, సందేశం కనిపిస్తాయి. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు, టామీ, చంటి, తోలుబొమ్మలాట వంటి చిత్రాలు కేవలం వినోదం కాదు సమాజానికి ఆత్మవిశ్వాసం, నైతికత, మానవ విలువలు నేర్పాయి. నిరాశలో ఉన్నవారు ఈ సినిమాల ద్వారా జీవితంపై మళ్లీ నమ్మకం పొందిన సందర్భాలు అనేకం. ఆయనను అనేక అవార్డులు, బిరుదులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో ఎనిమిది నంది అవార్డులు, రెండు బంగారు నంది అవార్డులు అందుకున్నారు. 1993లో ‘మిస్టర్‌ పెళ్లాం’ చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కింది. 2013లో కెనడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో డ్రీమ్‌ చిత్రానికి రాయల్‌ రీల్‌ అవార్డు వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజేంద్రప్రసాద్‌కు కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయనకు నటకిరీటి బిరుదును ఇచ్చారు. మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వృద్ధ కళాకారులకు ఆర్థిక భద్రత కల్పించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ గ్లోబల్‌ తెలుగు అకాడమీ (జీటీఏ)కు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:54 AM