ముగ్గురి ప్రాణాలను బలిగొన్న లారీలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:48 PM
లారీల రూపంలో మృత్యువు దూసుకురావడంతో ముగ్గురు బలయ్యారు.
గుర్తు తెలియని లారీ ఢీకొని ఒకరి మృతి
ఘటనా స్థలంలో సహాయక చర్యలో పాల్గొన్న వారిపైకి దూసుకొచ్చిన మరో లారీ
ఈ ఘటనలో మరో ఇద్దరు దుర్మరణం.. ఐదుగురికి గాయాలు
కర్నూలు నగరంలో విషాదం
లారీల రూపంలో మృత్యువు దూసుకురావడంతో ముగ్గురు బలయ్యారు. అప్పటికే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. కొందరు యువకులు పోలీసులతో పాటు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అయితే అంతలోనే మరో ఘోరం జరిగింది. వారిపైకి మరో లారీ వేగంగా దూసుకొచ్చింది. కొందరు తప్పించుకొని ప్రాణాలతో బయటపడగా.. ఇద్దరు యువకులు మాత్రం ఆ లారీకి బలయ్యారు. ఈ రెండు ఘటనలు మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.
కర్నూలు క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రెండు లారీలు బీభత్సం సృష్టించడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ముందుగా గుర్తు తెలియని లారీ ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్న వ్యక్తులపై మరో లారీ దూసుకురావడంతో మరో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి శేఖర్ (28) కర్నూలు నగరంలోని శివప్పనగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా పెంకుల తయారీ కేంద్రాన్ని పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తలనొప్పిగా ఉందని ట్యాబ్లెట్ల కోసం మోటారు సైకిల్‌పై కృష్ణానగర్ వైపు బయలుదేరాడు. అయితే కృష్ణానగర్ సమీపంలో ఉన్న హంద్రీ ఫ్లైఓవర్‌పై గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాకలి అజిత కుమార్, బండారి కన్నాతో పాటు మరికొందరు యువకులు ట్రాఫిక్ పోలీసులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న శేఖర్ మృతదేహాన్ని, బైక్‌ను తొలగించే క్రమంలో కొన్ని వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే హైదరాబాదు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ గ్రానైట్ లారీ అతివేగంగా ప్రమాద స్థలం వద్ద గుమికూడిన జనంపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకసారిగా అక్కడున్న ప్రజలు తలోదిక్కున పరుగులు తీశారు. వేగంగా దూసుకువచ్చిన లారీ చాకలి అజిత కుమార్, బండారి కన్నా, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, ఇంతియాజ్, చంద్రశేఖర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించేసరికి చెరుకులపాడుకు చెందిన చాకలి అజిత కుమార్ (26), కర్నూలు నగరంలోని శరీననగర్‌కు చెందిన బండారి కన్నా (23) మృతి చెందారు. ఫ్లైఓవర్ నుంచి దూకిన ఒకరికి, అలాగే లారీని నుంచి తప్పించుకునే క్రమంలో మరొకరికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నాలుగో పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ లేకుండా చేశారు. శేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజిత కుమార్‌కు తల్లిదండ్రులు అంజినమ్మ, ఆంజనేయులు ఉన్నారు. కర్నూలు నగరంలో ఓ మోటారు మెకానిక్ షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి తమ యజమాని ఇంట్లో జరిగే శుభకార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సుమారు ఇరవై నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు దుర్మరణం చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ఏడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.