తప్పు జరిగితే శ్రీవారే శిక్షిస్తాడు : వైవీ
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:04 AM
టీటీడీలో ఏ తప్పు జరిగినా ఆ వేంకటేశ్వరస్వామే శిక్షిస్తాడని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): టీటీడీలో ఏ తప్పు జరిగినా ఆ వేంకటేశ్వరస్వామే శిక్షిస్తాడని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దేవుడి సేవలో ఉన్నవారిపై ఏనింద వచ్చినా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని తమ పార్టీ డిమాండ్ చేసిందని తెలిపారు. ఆయనతో రాజీనామా చేయిస్తారా, లేదా అనేది కూటమి ప్రభుత్వ ఇష్టమని పేర్కొన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా తమపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం ఉంటుందనే తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని చెప్పారు. తనపై మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని వైవీ తెలిపారు.