Share News

శివుడికే శఠగోపం!

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:35 AM

దేవుడంటే భక్తిలేదు.. భయం అంతకన్నా లేదు.. దేవాలయాలు, ట్రస్టుల భూములు కనిపిస్తే చాలు గెద్దల్లా వాలిపోతున్నారు. ఇప్పటికే నందిగామ రామలింగేశ్వరుడి భూములను చెరపట్టారు. ఇప్పుడు ఏకంగా పరిటాల, కంచికచర్ల శివాలయాల భూములపై కన్నేశారు. వీరి వెనుక నందిగామ షాడో ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శివుడికే శఠగోపం!

- రెండు శివాలయాల భూములపై కన్నేసిన షాడో ఎమ్మెల్యే

- అర్చకుల అనుభవంలో ఉన్న భూములను చేతులు మార్చేందుకు డీల్‌!

- సరిగ్గా అదే సమయంలో కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

- ఆ తర్వాత కంచికచర్ల శివాలయం భూములు రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న దేవదాయ శాఖ

దేవుడంటే భక్తిలేదు.. భయం అంతకన్నా లేదు.. దేవాలయాలు, ట్రస్టుల భూములు కనిపిస్తే చాలు గెద్దల్లా వాలిపోతున్నారు. ఇప్పటికే నందిగామ రామలింగేశ్వరుడి భూములను చెరపట్టారు. ఇప్పుడు ఏకంగా పరిటాల, కంచికచర్ల శివాలయాల భూములపై కన్నేశారు. వీరి వెనుక నందిగామ షాడో ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

కంచికచర్ల రెవెన్యూ మండలం పరిధిలోని కంచికచర్ల, పరిటాల గ్రామాల్లో శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వేర్వేరుగా దేవుడి మాన్యం ఉంది. పరిటాల గ్రామంలో మల్లేశ్వరస్వామి పేరుతో సర్వే నెంబర్‌ బీ+1 (ఎల్‌పీ నెంబర్‌ 171)లో 25.71 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల స్వభావం చూస్తే దేవాలయ భూమిగా అడంగల్‌లో నమోదై ఉంది. 2015లో ఈ భూములను నిషేధిత భూముల జాబితాలోకి తీసుకురావడం జరిగింది. ఈ భూములను అర్చకులు వంశపారంపర్యంగా అనుభవిస్తున్నారు. అలాగే కంచికచర్లలోని శ్రీ విశ్వేశ్వరస్వామి దేవస్థానానికి సర్వే నెంబర్‌ 324లో 21.74 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు విశ్వేశ్వరస్వామి పేరుతోనే ఉన్నాయి. ఈ దేవాలయానికి సంబంధించిన భూములను కూడా వంశపారంపర్యంగా అర్చకులు అనుభవిస్తున్నారు. ఈ భూములపై కన్నేసిన కొందరు అర్చకులు కాలక్రమంలో తమ పేరుతో రిజిస్ర్టేషన్లు చేయించుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నందిగామ షాడో ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్టు సమాచారం. అర్చకుల నుంచి కారుచౌకగా ఈ భూములను కొట్టేసేందుకు స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది. లోపాయికారీగా ఒప్పందం కూడా జరిగినట్టు సమాచారం. పరిటాల గ్రామంలోని మల్లేశ్వరస్వామి భూములకు సంబంధించి రీ సర్వే జరిగింది. ల్యాండ్‌ పార్శిల్‌ నెంబర్‌ కూడా వచ్చింది. కంచికచర్ల విశ్వేశ్వరస్వామి ఆలయ భూములకు ఇంకా రీ సర్వే జరగలేదు. ఈ భూములకు సంబంధించి చేతులు మార్చి రిజిస్ర్టేషన్‌ చేయించుకునేందుకు షాడో ఎమ్మెల్యే పావులు కదిపినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు పొక్కనీయకుండా తెలివిగా వ్యవహారం నడుపుతున్నట్టు సమాచారం.

తహసీల్దార్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అనుమానాలు!

ఈ రెండు దేవాలయాల భూములకు సంబంధించిన రికార్డులు కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్నాయి. ఈ వ్యవహారాలు నడుస్తున్న దశలోనే కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు మొదట్లో ఎవ్వరికీ రాలేదు. తాజాగా వెలుగు చూస్తున్న అంశాలను గమనిస్తే మాత్రం అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిప్రమాదం ఘటన తర్వాత ఈ భూములను విశ్వేశ్వరస్వామి పేరుతో దేవదాయశాఖ అధికారులు రిజిస్ర్టేషన్‌ చేయించారు. అర్చకుల నుంచి భూములను చేజారనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఈ ఉదంతంతో కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. తహసీల్దార్‌ ఈ ఘటనపై ముఖ్యమైన రికార్డులేమీ దహనం కాలేదని ప్రకటించారు. కంచికచర్ల విశ్వేశ్వరస్వామి ఆలయం రికార్డులు భద్రంగా ఉన్నాయా? లేదా ? అన్నదానిపై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పరిటాల భూముల సంగతేమిటి ?

పరిటాల మల్లేశ్వరస్వామి ఆలయ భూముల సంగతేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ భూములపై దేవదాయ శాఖ అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములకు రీ సర్వే జరిగింది. ఈ భూములు కూడా వంశపారంపర్యంగా అర్చకుల చేతుల్లోనే ఉంటున్నాయి. ఈ భూములు అర్చకుల స్వాధీనంలోనే ఉన్నాయా? లోపాయికారీగా చేతులు మారాయా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భూములు దేవదాయ శాఖ ఆధీనంలోనే ఉన్నాయన్నదానిపై ఆ శాఖ అధికారుల నుంచి కూడా స్పష్టత రావడం లేదు.

Updated Date - Mar 17 , 2026 | 12:35 AM