Share News

అశ్వవాహనంపై స్వామి, అమ్మవార్లు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:04 PM

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులపాటు వైభవోపేతంగా జరిగాయి. నవవాహ్నిక దీక్షతో అర్చక వేదపండితులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు వాహన సేవలు జరిపించారు.

 అశ్వవాహనంపై స్వామి, అమ్మవార్లు
ఆలయోత్సవంలో పాల్గొన్న ఆలయ అధికారులు

ఆదిదంపతులకు ఆలయోత్సవం

శ్రీశైలంలో పుష్పోత్సవం, శయనోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజులపాటు వైభవోపేతంగా జరిగాయి. నవవాహ్నిక దీక్షతో అర్చక వేదపండితులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు వాహన సేవలు జరిపించారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రాగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించిన వేదికపై అశ్వవాహనాధీశులైన ఆదిదంపతులకు షోడషోపచార పూజలు చేసి మంగళహరతులు ఇచ్చారు. అశ్వం వేగానికి, ఙ్ఙానానికి ప్రతీక. అశ్వవాహనాధీశులైన ఆదిదంపతులను దర్శించడం వలన కోరినకోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అనంతరం ఆలయోత్సవంలో భాగంగా స్వామిఅమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణలు చేశారు. సాంస్కృతిక కళారూపాలు, చెంచుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాల నడుమ ఆలయోత్సవం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది.

శోభాయమానంగా పుష్పోత్సవ శయనోత్సవ వేడుక

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి ఘట్టమైన పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంతసేవ వేడుకలు శోభాయమానంగా నిర్వహించారు. పుష్పోత్సవంలో ప్రత్యేక పుష్పాలైన కాగడాలు, ఎరుపు, తెలుపు. పసుపు రంగుల గులాబీలు, ఎర్ర, తెల్లని ముద్ద మందారాలు, గరుడవర్థనం, నందివర్థనం, చామంతులు, గన్నేరు, కలువలు, సన్నజాజి, విరజాజి, సంపంగి, బిల్వము, మర్వ పత్రాలు వంటితోపాటు బత్తాయి, నారింజ, ద్రాక్ష, ధానిమ్మ, అరటి, జామ, ఖర్జూర, ఆపిల్‌, పైనాపిల్‌ మరియు వివిధ రకాల పండ్లు పుష్పాలతో పుష్సోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరగా ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో శయనోత్సవం జరిపించి ఏకాంతసేవను నిర్వహించడంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసాయి.

నేటి నుంచి స్వామివారి స్పర్శ దర్శనాలు

గురువారం నుంచి స్వామి, అమ్మవార్ల ప్రత్యక్ష, పరోక్ష ఆర్జితసేవలైన గణపతి, రుద్ర, మృత్యుంజయ, చండీహోమాలు, వల్లీదేవసేన కల్యాణం, స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం, గర్బాలయ, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు, వృద్దమల్లికార్జున అభిషేకాలు, బిల్వార్చనలు, ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ప్రదోశకాలసేవ, ఏకాంతసేవలతో పాటు స్వామివారి స్పర్శదర్శనాలను భక్తులకు ఆనలైనలో అందుబాటులో ఉంచినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Feb 18 , 2026 | 11:05 PM