వలీని త్వరలోనే కలుస్తా.. కోవా బన్ రుచి చూస్తా..!
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:52 AM
కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి లోకేశ్ మద్దతుగా నిలిచారు. త్వరలోనే ఆయనను కలిసి, కోవా బన్ రుచి చూస్తానని ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు.
కోవా బన్ వ్యాపారికి మద్దతుగా మంత్రి లోకేశ్ పోస్టు
అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి లోకేశ్ మద్దతుగా నిలిచారు. త్వరలోనే ఆయనను కలిసి, కోవా బన్ రుచి చూస్తానని ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు. ‘డియర్ వలీ... మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం బాధ కలిగించింది. సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం కోసం ఎల్లప్పుడూ నిలబడే మన తెలుగు సమాజంలో ఇటువంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు చోటు లేదు. నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. మీరు తయారు చేసే కోవా బన్‌ను రుచి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మేం మీకు అండగా నిలబడతాం’ అని లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. కర్నూలు చెందిన చిరు వ్యాపారి వలీ.. ఇలీవల మేడారం జాతరలో కోవా బన్‌లు అమ్ముతుండగా.. ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అతని వద్దకు వెళ్లి కోవా బన్ నాణ్యతపై ప్రశ్నించాడు. ఏదో కల్తీ చేసి ఉంటావంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆధార్ కార్డు చూపించాలని, పేరు చెప్పాలని ఒత్తిడి చేస్తూ.. ఆ చిరు వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడాడు. అయితే.. తాను అమ్మే బన్ నాణ్యమైనదేనని నిరూపించుకోవడానికి.. ఆ చిరు వ్యాపారి నిస్సహాయ స్థితిలోనే దాన్ని తిని చూపించాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోవా బన్ వ్యాపారికి రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.