ఉత్తరాంధ్రలో ఆర్‌ఈఈ రిఫైనింగ్ హబ్
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:52 AM
రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరెడ్మెట్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ ఆదివారం మాస్కోలో సమావేశమయ్యారు.
నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయండి
‘గిరెడ్మెట్’ ప్రతినిధులకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి
సాంకేతిక భాగస్వామ్యం భవిష్యత్తులో విలువైన అవకాశాలను తెరుస్తుందని వ్యాఖ్య
మాస్కోలో అణుశక్తి మ్యూజియం సందర్శన
అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరెడ్మెట్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ ఆదివారం మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు గిరెడ్మెట్ వంటి సంస్థలతో సాంకేతిక భాగస్వామ్యం భవిష్యత్తులో విలువైన అవకాశాలను తెరుస్తుందన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ (ఆర్‌ఈఈ) రిఫైనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. భారత్‌లో విస్తరిస్తున్న ఈవీ, పవన విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించాలన్నారు. భారతీయ టెక్ కారిడార్‌లో సిద్ధంగా ఉన్న ప్లగ్-అండ్-ప్లే ప్రయోగశాలల మద్దతుతో మెటలర్జీ అలా్ట్ర-ప్యూర్ సెమీకండక్టర్ అండ్ ఎలకా్ట్రనిక్ మెటీరియల్స్ ల్యాబ్ సహస్థాపనకు చొరవ చూపాలని కోరారు. పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ టెయిలింగ్స్ నుంచి వ్యూహాత్మక అరుదైన లోహాలను వెలికితీయడానికి, తగిన సాంకేతికతలను అమలు చేయడంలో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
మాస్కో కేంద్రంగా గిరెడ్మెట్
1931లో స్థాపించిన గిరిడ్మెట్ సంస్థ మాస్కో కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభుత్వ అణుశక్తి కార్పొరేషన్ ‘రోసాటామ్’ శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలో కీలక పరిశోధన-డిజైన్ సంస్థగా కొనసాగుతోంది. రేర్ ఎర్త్ మూలకాలు, కీలక లోహాలు, సెమీ కండక్టర్ పదార్థాలు, అధిక శుద్ధి రసాయనాల రంగాల్లో ఈ సంస్థకు ప్రత్యేక నైపుణ్యముంది. గిరెడ్మెట్ సంస్థ జాతీయ సాంకేతిక స్వావలంబనను బలోపేతం చేసే కేంద్రంగా పనిచేయడంతో పాటు అంతర్జాతీయ సహకారాల ద్వారా కూడా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. మాస్కోలోని ప్రత్యేక ప్రయోగశాలలు, పైలట్ స్థాయి పరీక్షా సౌకర్యాలు, డిజైన్ కేంద్రాలు రోసాటామ్ విస్తృత పారిశ్రామిక నెట్‌వర్క్‌తో అనుసంధానమై పనిచేయడం వల్ల ఈ సంస్థ పరిశోధనతో పాటు పారిశ్రామిక అమలు సామర్థ్యం కలిగి ఉంది. ముఖ్యంగా కీలక ఖనిజాలు, బ్యాటరీ రీసైక్లింగ్, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్, అధునాతన పదార్థాల అభివృద్ధి రంగాల్లో భారతదేశంతో భాగస్వామ్య అవకాశాలు పెరుగుతున్నాయి.
మాస్కో అణుశక్తి మ్యూజియం సందర్శన
మాస్కోలో 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 7 అంతస్తుల్లో ఉండే అతిపెద్ద అణుశక్తి మ్యూజియంను మంత్రి లోకేశ్ సందర్శించారు. సోవియట్ అణు ప్రాజెక్టు ప్రారంభ దశల నుంచి ఆధునిక అణుశక్తి రంగ అభివృద్ధి, భవిష్యత్తు శాస్త్రీయ అవకాశాల వరకు విస్తరించిన ప్రదర్శనలు ఈ మ్యూజియంలో ప్రత్యేకం. మ్యూజియంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, శాస్త్ర ప్రయోగశాలలు, గైడెడ్ టూర్లు ఉండటం వల్ల ఇది ప్రజలకు విజ్ఞానపరమైన అనుభవాన్ని అందిస్తోంది. 2023 నవంబరులో ప్రారంభమైన ఈ మ్యూజియం ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందింది. విజ్ఞానం, చరిత్ర, సాంకేతికత సమన్వయ వేదికగా నిలుస్తోన్న ఈ మ్యూజియాన్ని 80 దేశాలకు చెందిన 35 లక్షల మందికి పైగా సందర్శించినట్లు నిర్వాహకులు లోకేశ్‌కు వివరించారు. ఒకేసారి 2100 మంది వరకు సందర్శకులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. మాస్కో ప్రభుత్వం, రోసాటామ్ స్టేట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం అణుశక్తి చరిత్రను మాత్రమే కాకుండా, శాంతిపూర్వక అణు వినియోగ విజయాలను కూడా సమగ్రంగా పరిచయం చేస్తోంది.