Share News

విశాఖకు రండి

ABN , Publish Date - Jan 23 , 2026 | 05:05 AM

విశాఖలో గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యాక్సెంచర్‌ సీఈవో మనీశ్‌ శర్మను మంత్రి లోకేశ్‌ కోరారు.

విశాఖకు రండి

  • గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ ఏర్పాటు చేయండి.. యాక్సెంచర్‌ను కోరిన లోకేశ్‌

  • సానుకూలంగా స్పందించిన సీఈవో మనీశ్‌ శర్మ

  • దావోస్‌లో మంత్రితో సమావేశం

  • క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సదస్సులో పాల్గొన్న లోకేశ్‌

అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): విశాఖలో గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యాక్సెంచర్‌ సీఈవో మనీశ్‌ శర్మను మంత్రి లోకేశ్‌ కోరారు. లోకేశ్‌ ప్రతిపాదనపై ఆయన సానుకూలంగా స్పందించారు. దావోస్‌ ఆర్థిక సదస్సులో గురువారం లోకేశ్‌ను మనీశ్‌ శర్మ కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మౌలిక సదుపాయాలు, ప్రతిభ లభ్యత, అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని ఏఐ, క్లౌడ్‌, డిజిటల్‌ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్‌ అన్నారు. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేయాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు ఫ్యూచర్‌ రైట్‌ స్కిల్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా సహకారం అందించాలన్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అప్లికేషన్లు, ఎకోసిస్టమ్‌ డెవల్‌పమెంట్‌తో పాటు స్టార్ట్‌పలకు మద్దతు ఇచ్చేందుకు అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో భాగస్వామ్యం కావాలని కోరారు. జెన్‌ఏఐ, ఎక్స్‌ఆర్‌, బ్లాక్‌ చైన్‌ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించేలా యాక్సెంచర్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో అనుసంఽధానం చేయాలని లోకేశ్‌ అన్నారు. తమ సంస్థ బెంగళూరులో 2023లో ఒక జనరేటివ్‌ ఏఐ స్టూడియోను ప్రారంభించిందని మనీశ్‌ వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో ఏఐపై ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. తమ సంస్థ ఏఐ, డిజిటల్‌ టాలెంట్‌ అభివృద్ధి పై గణనీయంగా పెట్టుబడులు పెడుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50,000 ఏఐ నిపుణులను తయారు చేస్తున్నామని వెల్లడించారు. వీరిలో అధికభాగం భారతీయులేనని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకువెళతామని మనీశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 05:07 AM