Share News

లోకేశ్‌ ఓఎస్డీకి రెండు గోల్డ్‌ మెడల్స్‌!

ABN , Publish Date - Jun 11 , 2026 | 06:01 AM

మంత్రి లోకేశ్‌ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ కసిరెడ్డి వరప్రసాద్‌కు ఎస్వీ యూనివర్సిటీ రెండు గోల్డ్‌మెడల్స్‌ ప్రదానం చేసింది. ఆ వర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో..

లోకేశ్‌ ఓఎస్డీకి రెండు గోల్డ్‌ మెడల్స్‌!

  • ప్రదానం చేసిన ఎస్వీ యూనివర్సిటీ

  • మునిసిపల్‌ బాండ్లపై పత్రాన్ని సమర్పించిన వరప్రసాద్‌

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్‌ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ కసిరెడ్డి వరప్రసాద్‌కు ఎస్వీ యూనివర్సిటీ రెండు గోల్డ్‌మెడల్స్‌ ప్రదానం చేసింది. ఆ వర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన వరప్రసాద్‌ పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలికవసతుల కల్పనకు అవసరమైన దీర్ఘకాలిక నిధులను ఎలా సమకూర్చుకోవాలో వివరిస్తూ పత్రాన్ని సమర్పించారు. నిధుల సేకరణ కోసం పట్టణస్థానిక సంస్థలు మునిసిపల్‌ బాండ్లను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇందులో విశ్లేషించారు. ఇందుకుగాను 2023-24 సంవత్సరానికి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గోల్డ్‌మెడల్‌, ప్రొఫెసర్‌ డీఎల్‌ నారాయణ మెమోరియల్‌ పీహెచ్‌డీ గోల్డ్‌ మెడల్‌లను వర్సిటీ ఆయనకు ప్రదానం చేసింది. బుధవారం ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన 63, 64, 65, 66, 67, 68వ వార్షిక స్నాతకోత్సవాల కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ రెండు గోల్డ్‌మెడల్స్‌ను ఆయనకు అందజేశారు. ప్రస్తుతం ఉన్న మునిసిపల్‌ బాండ్ల విధానంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా అటు ప్రభుత్వానికి, ఇటు పెట్టుబడి పెట్టే ప్రజలకు.. ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా చేయవచ్చని వరప్రసాద్‌ ప్రతిపాదించారు. ఈ పత్రంపై స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ సి.కుటుంబరావు తన అభిప్రాయాలతో ఒక సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. తెలంగాణలో మునిసిపల్‌ గవర్నెన్స్‌పై వరప్రసాద్‌ చేసిన పరిశోధన లోతైనదని కొనియాడారు.


నాడు సస్పెన్షన్‌.. నేడు మెడల్స్‌

వైసీపీ హయాంలో ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానం చెప్పలేక ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను జగన్‌ సర్కారు సస్పెండ్‌ చేసింది. నాడు సస్పెండ్‌ అయిన వారిలో వరప్రసాద్‌ ఒకరు. దాదాపు మూడేళ్లు సస్పెన్షన్‌లో ఉన్న తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఈ ముగ్గురిపై సస్పెన్షన్‌ను ఎత్తేశారు. వరప్రసాద్‌ కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలో గుర్తింపు పొందిన ఒక ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌ హోదాలో ఉన్నారు. డిప్యూటేషన్‌పై మంత్రి లోకేశ్‌ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. గతంలో 2014-19 సమయంలో సీఎంవోలో పనిచేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై, బడ్జెట్‌ నిర్వహణ, పబ్లిక్‌ ఫైనాన్స్‌,, మునిసిపల్‌ బాండ్లు, ల్యాండ్‌ పూలింగ్‌ పథకాలపై లోతైన జ్ఞానం ఉంది.

Updated Date - Jun 11 , 2026 | 06:01 AM