Share News

టీమ్‌గా పనిచేస్తాం.. స్వర్ణాంధ్ర సాధిస్తాం!

ABN , Publish Date - May 01 , 2026 | 03:52 AM

గత 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదని మంత్రి లోకేశ్‌ అన్నారు. మంత్రులు, అధికారులు ఒక టీమ్‌గా పనిచేసి ...

టీమ్‌గా పనిచేస్తాం.. స్వర్ణాంధ్ర సాధిస్తాం!

  • గత 22 నెలల పాలనలో ఏపీ సాధించిన

  • విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు: లోకేశ్‌

గుంటూరు(రాజధాని) ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): గత 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదని మంత్రి లోకేశ్‌ అన్నారు. మంత్రులు, అధికారులు ఒక టీమ్‌గా పనిచేసి స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘డిన్నర్‌ విత్‌ ద రియల్‌ విన్నర్స్‌’ కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 మధ్య పనిచేసిన టీమ్‌ అంతా ఇక్కడ ఉందని, అయితే ఇప్పుడే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు అని పేర్కొన్నారు. చాలా త్వరగా ఫలితాలు రావాలని కోరుకునే నాయకుడు, వేగంగా మార్పులు తీసుకురావాలనుకునే సంస్కరణవాది చంద్రబాబు అని ప్రశంసించారు. కుటుంబాన్ని నిలబెట్టడానికి తండ్రి ఎలా కష్టపడతారో అదేవిధంగా చంద్రబాబు కూడా కష్టపడ్డారని, ఆయనను ఆంధ్రప్రదేశ్‌ తండ్రిగా చూస్తానని అన్నారు. ‘ఇప్పుడు మంత్రులుగా చంద్రబాబు 4.0లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాం. సీఎంగా ఇది ఆయనకు నాలుగో పర్యాయం. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు. దీనికి మంచి ఉదాహరణ లిఫ్ట్‌ పాలసీ. ఫార్చ్యూన్‌ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చినప్పుడు.. ఆయనను ఒప్పించడానికి 30 నిమిషాలు పట్టింది. కానీ ఒకసారి ఒప్పుకున్న తర్వాత.. ఆ నిర్ణయం వల్ల గూగుల్‌, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి మార్గం సుగమమైంది. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుత అనుభవం’ అని లోకేశ్‌ అన్నారు.


2024-29 పాలన గురించి గొప్పగా చెప్పుకునేలా పని చేస్తాం

‘నా వ్యక్తిగత లక్ష్యం ఒక్కటే.. 1995-99 నాటి పాలన కంటే.. 2024 నుంచి 2029 వరకు ప్రభుత్వ కాలం గొప్పదని చంద్రబాబు స్వయంగా చెప్పాలి. మంత్రులుగా మేమంతా ఆయన విజన్‌తో ప్రేరణ పొందుతున్నాం. శాఖల మధ్య పోటీగా కాకుండా.. ఒక టీమ్‌గా పనిచేస్తాం. మన లక్ష్యం ఒక్కటే.. స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణం’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. ‘ఈగో కాదు.. ఫలితాలే ముఖ్యం. 75 ఏళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా చేస్తున్న వ్యక్తికే అహంకారం లేకపోతే.. మనకు ఉండాల్సిన అవసరం లేదు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ఇప్పుడు అత్యవసరం. 800 ప్రాజెక్టులను ట్రాక్‌ చేసి, గ్రౌండింగ్‌ చేయడం చాలా పెద్ద విషయం. గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చరిత్ర సృష్టించడానికే ఇక్కడ ఉన్నాం. భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయి. 50 శాతం ఎప్పుడు సాధిస్తారని సీఎం అడిగారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేమంతా ఒక టీమ్‌గా, ఎలాంటి ఈగో లేకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ లక్ష్యాలను చేరుకుంటాం’ అని తెలిపారు.

పెట్టుబడుల కోసం పరుగులు పెట్టిస్తున్నారు: మంత్రులు

పెట్టుబడులు రాబట్టే విషయంలో చంద్రబాబు తమను పరుగులు పెట్టిస్తున్నారని పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. పట్టిసీమను ఒట్టిసీమ అనివిమర్శించారని, కానీ అదే పట్టిసీమ రూ.50 వేల కోట్ల సంపదను సృష్టించిందని.. దటీజ్‌ చంద్రబాబు అంటూ మంత్రి నిమ్మల ప్రశంసించారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ సింగపూర్‌కు అధ్యయనం కోసం వెళ్లినప్పుడు తిరిగొచ్చాక చంద్రబాబు ఏం అడుగుతారోననే భయంతో ఆ దేశంలో ఏడు రోజులపాటు క్లాసులకు అటెండ్‌ అయ్యామన్నారు. మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ రిఫార్మర్‌ అనే పదానికి రాజకీయాల్లో నిజమైన నిర్వచనం సీఎం చంద్రబాబు అని అన్నారు.

Updated Date - May 01 , 2026 | 03:52 AM