Share News

పరిశ్రమలకు ఆంధ్రా అనుకూలం

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:22 AM

దావోస్‌‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.

పరిశ్రమలకు ఆంధ్రా అనుకూలం

  • కనెక్టివిటీకి అనువుగా పోర్టులు.. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి పలు అవకాశాలు

  • దావోస్‌‌లో పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): దావోస్‌‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర మంత్రి లోకేశ్‌ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమకూరుస్తున్న వసతులను వివరించారు. సుదీర్ఘ కోస్తా తీరం, పోర్టులు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటాయని చెప్పారు. పోర్టులకు అనుసంధానంగా ఉండే ఏపీ పారిశ్రామిక నోడ్‌లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. జెరా గ్లోబల్‌ సీఈవో యుకియా కానితో లోకేశ్‌ భేటీ అయ్యారు. గ్రీన్‌ అమ్మోనియా తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, జపాన్‌, ఇతర ఆసియా మార్కెట్లకు లోకార్బన్‌ అమ్మోనియా సరఫరా చేయడానికి రాష్ట్రంలో మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని సమీపంలోని గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని యుకియా కానికి లోకేశ్‌ సూచించారు. పారిశ్రామిక వినియోగదారులకు అవసరమైన క్లీన్‌ ఎనర్జీ కోసం రాయలసీమలో సౌర, పవన హైబ్రీడ్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని కోరారు. పునరుత్పాదక ఇంధన వనరులు, లిక్విడ్‌ నైట్రోజన్‌, లోకార్బన్‌ అమ్మోనియా తయారీకి అనుకూలంగా ఏపీ ఉంటుందన్నారు. అమ్మోనియా యాంకర్‌ పరిశ్రమలకు ఏపీ అనువైనదన్నారు. థర్మల్‌ ప్లాంట్లలో అమ్మోనియా కోఫైరింగ్‌ను పరిశీలించడానికి పైలట్‌ ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. యుకియా కాని మాట్లాడుతూ.. భవిష్యత్తులో క్లీన్‌ ఇంధన దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి భారత్‌లోని గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా వాల్యూ చెయిన్‌లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

2.jpg


డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధా ఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్‌ ఇంజనీరింగ్‌, బ్యాకెండ్‌ సిస్టమ్స్‌, ట్రేడింగ్‌ అవరోధాలు, డేటా ఇంటెలిజెన్స్‌, ఫిన్‌టెక్‌ ఆర్‌అండ్‌డీపై విశాఖలో టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కామత్‌ను లోకేశ్‌ కోరారు. రాష్ట్ర ఎంటర్‌ప్రెన్యూషి్‌పలను ప్రోత్సహించడం, ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి లీడ్‌ మెంటార్‌గా వ్యవహరించాలని సూచించారు. దేశంలో మొదటిసారిగా మల్టిపుల్‌ డెలివరీ చానెళ్ల ద్వారా పాఠశాల నుంచి కళాశాల దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్షియల్‌ లిటరసీ కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని లోకేశ్‌ కోరారు. దీనికి నిఖిల్‌ కామత్‌ సానుకూలంగా స్పందించారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు త్వరగా

ప్రారంభించండి: కడప స్టీల్‌ ప్లాంట్‌ను త్వరితగతిన ప్రారంభించాలని జెఎ్‌సడబ్ల్యూ ఎండీ పార్థ్‌ జిందాల్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. అలాగే రాష్ట్రంలో పెయింట్స్‌ తయారీ ప్లాంటును స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. దావో్‌సలో కలిసిన సందర్భంగా కడప స్టీల్‌ ప్లాంట్‌ భూమిపూజ, పనుల షెడ్యూల్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే బర్జర్‌, ఏసియన్‌ వంటి కంపెనీల కార్యక్రమాలు సాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో డెకరేటివ్‌, ఇండస్ట్రియల్‌ పెయింట్స్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని జిందాల్‌ను కోరారు. జేఎ్‌సడబ్ల్యూ-ఎల్జీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయతలబెట్టిన బ్యాటరీ తయారీ యూనిట్‌ను శ్రీసిటీ లేదా విశాఖలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. జేఎ్‌సడబ్ల్యు గ్రూప్‌ చేపట్టిన వారసత్వ కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగా ఏపీలోని గండికోట, ఉండవల్లి గుహలు వంటి వారసత్వ ప్రదేశాలను తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనపై చర్చించి త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానని జిందాల్‌ వెల్లడించారు.

ప్రాజెక్టులు వేగవంతం చేయండి

విశాఖ భాగస్వామ్య సదస్సులో బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీతో జరిగిన ఒప్పందంలో దావోస్‌ కేంద్రంగా మరో అడుగు ముందుకు పడింది. ఆ కంపెనీ ప్రెసిడెండ్‌ కానర్‌ టెస్కీతో లోకేశ్‌ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 12 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరిపారు. ఫాస్ట్‌ట్రాక్‌ మోడ్‌లో ఆ ఒప్పందాలను కార్యరూపం దాల్చేలా చూడాలని లోకేశ్‌ కోరారు. అలాగే పోర్టు ఆధారిత ఇండిస్ట్రియల్‌ క్లస్టర్లలో ఎనర్జీ స్టోరేజీ, సోలార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులపై వీరి మధ్య చర్చ జరిగింది. బ్రూక్‌ఫీల్డ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా ఏపీలో నిర్మాణమయ్యే యాక్సిస్‌ ఎనర్జీ, ఎవ్రాన్‌ ప్రాజెక్టులపైనా వారు చర్చించారు. బ్రూక్‌ఫీల్డ్‌ లాంటి కంపెనీ రావడం ఏపీకి పెద్ద ఉత్సాహాన్ని ఇస్తుందని లోకేశ్‌ చెప్పారు.

Updated Date - Jan 22 , 2026 | 04:22 AM