Share News

‘లీడర్‌’ ఆత్మీయ కలయిక

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:51 AM

పార్లమెంటు నియోజకవర్గాలవారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతోపాటు తన ఇంటికి ఆహ్వానించి..

‘లీడర్‌’ ఆత్మీయ కలయిక

  • కూటమి ఎమ్మెల్యేల కుటుంబాలతో లోకేశ్‌ విందు సమావేశం

అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు నియోజకవర్గాలవారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతోపాటు తన ఇంటికి ఆహ్వానించి.. ఆహ్లాదకర వాతావరణంలో విందు ఏర్పాటు చేసి, మాటల ముచ్చట్లతో గడిపే సరికొత్త సంప్రదాయానికి రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో గురువారం రాత్రి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులను లోకేశ్‌ తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. అంతా ఒకే చోట కూర్చుని భోజనం చేశారు. వీరిలో మంత్రి కొల్లు రవీంద్ర(మచిలీపట్నం), టీడీపీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌ (పెనమలూరు), యార్లగడ్డ వెంకట్రావు (గన్నవరం), కాగిత కృష్ణప్రసాద్‌ (పెడన), వర్ల కుమార్‌రాజా (పామర్రు), మండలి బుద్ధప్రసాద్‌-జనసేన-అవనిగడ్డ) కుటుంబ సభ్యులు ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు కూడా కుటుంబసభ్యులతో ఈ ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పరిచయం చేసుకున్న లోకేశ్‌.. అందరినీ ఆత్మీయంగా పలుకరించారు. ఏం చేస్తున్నారు.. భవిష్యత్‌ ఆలోచనలు ఏమిటని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. తన ఇంటికి వచ్చిన ఆడపడుచులకు తన నియోజకవర్గం మంగళగిరి చేనేత పట్టుచీరలను బహుకరించారు. ఆయా ప్రజాప్రతినిధులు వివిధ సందర్భాల్లో తనకు ఇచ్చిన నియోజకవర్గ సమస్యలపై వినతులకు సంబంధించిన తాజా స్థితిని నివేదిక రూపంలో వారికి అందజేశారు. చేయలేకపోయిన వాటికి కారణాలు కూడా వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ.. కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తుందని, ఎన్టీఆర్‌ నుంచి మొదలైన ఈ సంప్రదాయం.. చంద్రబాబు హయాంలో మరో స్థాయికి చేరుకుందని అన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉండడంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విదేశాల్లో ఉండడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో అందుబాటులో ఉన్న ఎంపీలు మాత్రమే రావాలని హాజరుకావాలని లోకేశ్‌ కార్యాలయ వర్గాలు కోరాయి. శుక్రవారం జరిగే ఆత్మీయ సమావేశానికి చిత్తూరు పార్లమెంటు నుంచి ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాశ్‌ (నగరి), వీఎం థామస్‌ (గంగాధర నెల్లూరు), గురజాల జగన్మోహన్‌ (చిత్తూరు), ఎన్‌.అమరనాథ్‌రెడ్డి (పలమనేరు), పులివర్తి నాని (చంద్రగిరి), ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌... అనకాపల్లి పార్లమెంటు నుంచి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), మంత్రి అనిత (పాయకరావుపేట), బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), కేఎ్‌సఎన్‌ఎస్‌ రాజు (చోడవరం) కుటుంబ సభ్యులతో హాజరుకానున్నారు. వీరితో పాటు జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కూ ఆహ్వానాలు పంపారు.

Updated Date - Feb 13 , 2026 | 03:51 AM