Share News

సింగపూర్‌తో బలమైన భాగస్వామ్యం

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:02 AM

సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ (చెన్నై) ఎడ్గర్‌ పాంగ్‌తే చియాంగ్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన..

సింగపూర్‌తో బలమైన భాగస్వామ్యం

  • పెట్టుబడుల గ్రౌండింగ్‌పై దృష్టిపెట్టాం

  • కాన్సులేట్‌ జనరల్‌ ఎడ్గర్‌తో లోకేశ్‌ భేటీ

అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ (చెన్నై) ఎడ్గర్‌ పాంగ్‌తే చియాంగ్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్‌తో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. భారత్‌, సింగపూర్‌ మధ్య సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సంబంధిత రంగాల్లో ద్వైపాక్షిక సహకరాన్ని ప్రోత్సహించడంలో ఎడ్గర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పెట్టుబడులకు గల అవకాశాలను లోకేశ్‌ వివరించారు. ప్రజాప్రభుత్వంలో పెట్టుబడుల గ్రౌండింగ్‌పై దృష్టి సారించామని, రాష్ట్రంలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని, గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ వంటి కంపెనీలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో గత ఏడాది కంటే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైందన్నారు. గతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పారదర్శక విధానంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సింగపూర్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఇటీవల సింగపూర్‌ అధ్యయన యాత్రకు ఏపీ ఉపాధ్యాయుల బృందం వెళ్లిన విషయాన్ని లోకేశ్‌ గుర్తు చేశారు. విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. తన రష్యా పర్యటన విశేషాలనూ పంచుకున్నారు. ఎడ్గర్‌ మాట్లాడుతూ.. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించారు. భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 30 , 2026 | 06:03 AM