Share News

అమరావతి అజరామరం!

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:48 AM

అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశానని, అమరావతి చరిత్ర, సంస్కృతి, ఆవశ్యకతను సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా..

అమరావతి అజరామరం!

  • ఒక్క ఇటుకనూ జగన్‌ తాకలేడు: లోకేశ్‌

  • బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశానని, అమరావతి చరిత్ర, సంస్కృతి, ఆవశ్యకతను సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయని మంత్రి లోకేశ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని పార్టీలు బిల్లుకు మద్దతుగా నిలవడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు అద్దం పట్టిందన్నారు. అమరావతి బిల్లు ఆమోదం రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులని, శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం.. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర - సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపిందని తెలిపారు. ‘లోక్‌సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైంది. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్‌ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్‌ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఏపీ అభివృద్ధిని ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం’ అని లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. బిల్లుకు మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి, వివిధ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 04:48 AM