నేడు మావిగన్.. రేపు బెంతాహై!
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:40 AM
నాడు అమరావతికి జై అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని ఊదరగొట్టాడు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త..
జగన్‌పై లోకేశ్ విసుర్లు
శాంతిభద్రతలపై ఆయన మాటలు హాస్యాస్పదం
15 నుంచి ఇంటింటికీ వెళ్లాలి
16 నుంచి 18 వరకు మెగా పీటీఎం
ఆ సమయంలోనే రెండో విడత‘తల్లికి వందనం’ నిధులు విడుదల
శ్రీకాళహస్తి టీడీపీ క్యాడర్ భేటీలో మంత్రి వెల్లడి
తిరుపతి సిటీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘నాడు అమరావతికి జై అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని ఊదరగొట్టాడు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. రేపు బెంతాహై (బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్) అని జగన్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ అన్నారు. రేణిగుంట సమీపాన జరిగిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మన పార్టీకి తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు మహిళ వంటి అనుబంధ సంఘాలుంటే.. గొడ్డలి పార్టీకి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్ వంటి అనుబంధ సంఘాలున్నాయి. వారి నేరచరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు. మాటతప్పను.. మడమ తిప్పను అంటుంటారు. అబద్ధాలు వాళ్లు అంత అందంగా చెబుతారు.. మనం నిజం కూడా ఆ విధంగా చెప్పలేకపోతున్నాం. గొడ్డలి పార్టీ వాళ్లు చేసిన అరాచకాలు, వేధింపులు, అహంకారం వంటి అవలక్షణాల జబ్బు మనకు రాకుండా చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా వస్తే వ్యాక్సిన్ వేస్తా. ఎవరినీ వదిలిపెట్టను. మళ్లీ గొడ్డలి పార్టీ వస్తే మా పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు’ అని చెప్పారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వ విజయాలపై జూలై 15 నుంచి ఇంటింటికీ వెళ్తున్నామని గుర్తుచేశారు. ‘మన రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు మరెక్కడా లేవు. ఈ నెల 16 నుంచి 18 వరకు మెగా పీటీఎం నిర్వహించే సమయంలో రెండో విడత ‘తల్లికి వందనం’ నిధులు విడుదల చేస్తాం.ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగావకాశాలు కల్పించాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సంక్షేమం, అభివృద్ధి.. మనం వెళ్లే ఊరికి పాస్‌పోర్ట్ లాంటివి. గతంలో ఎప్పుడూ ఈ విధంగా కార్యకర్తలను కలిసింది లేదు. మీ కోరిక మేరకు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలిసి వెళ్తున్నా. పనిచేసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసే బాధ్యత నాది’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.