ఆ గజదొంగ జగనేనా?
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:57 AM
గత (2019) సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి కత్తిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ (టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు) చేతుల్లో పెట్టారని మంత్రి లోకేశ్ అన్నారు.
బొత్స వ్యాఖ్యలకు లోకేశ్ కౌంటర్
నాడు బాబాయ్‌ను చంపి కత్తి మా చేతిలో పెట్టారు
ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్స్‌తో హెరిటేజ్‌కు సంబంధం అంటగడుతున్నారు
జగన్, వైసీపీవన్నీ తప్పుడు ఆరోపణలు
నాడు మాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే
మీడియాతో మంత్రి లోకేశ్ చిట్‌చాట్
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): గత (2019) సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి కత్తిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ (టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు) చేతుల్లో పెట్టారని మంత్రి లోకేశ్ అన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వీఎస్ఆర్ ఏవియేషన్స్ విమాన ప్రమాదంలో మరణించిన ఘటనతో హెరిటేజ్‌కు సంబంధం ఉందంటూ వైసీపీ ఆరోపణలు చేయడం కూడా ఇలాంటిదేనన్నారు. వీఎస్ఆర్ ఏవియేషన్స్‌తో హెరిటేజ్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో లోకేశ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హెరిటేజ్ ఫిన్‌లీస్‌ను 1996లో స్థాపించారని తెలిపారు. 2022లో హెరిటేజ్ ఫిన్‌లీస్ నుంచి వేల సంస్థల తరహాలోనే వీఎస్ఆర్ ఏవియేషన్స్ రుణం తీసుకుందని చెప్పారు. ఆ సంస్థ రుణం తీసుకునే నాటికి తాము అధికారంలో లేమన్నారు. 2024లో తమ ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర విమానయాన మంత్రి అవుతారని గానీ, 2026లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వీఎ్‌సఆర్ ఏవియేషన్స్ విమానంలో ప్రయాణిస్తారని గానీ, ఆ విమానం ప్రమాదానికి గురవుతుందని గానీ తాము కలలో కూడా అనుకోలేదన్నారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలిసేందుకు తాము జోస్యులం కాదన్నారు. వీఎస్ఆర్ ఏవియేషన్స్‌కు రుణం ఇవ్వడం మినహా హెరిటేజ్ ఫిన్‌లీస్‌కు ఎలాంటి సంబంధాలూ లేవన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే విధంగా బాబాయ్‌ని గొడ్డలితో నరికి, ఆయుధాన్ని తమ (టీడీపీ) చేతుల్లో పెట్టేశారని.. ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్స్‌తో హెరిటేజ్ ఫిన్‌లీస్‌కు సంబంధం అంటగడుతున్నారని మండిపడ్డారు.
ఓ కుటుంబంలా ఉన్నాం
టీడీపీ ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా ఒక వర్సిటీ పెట్టామని లోకేశ్ అన్నారు. ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు రెసిడెన్సియల్ తరహాలో ఓరియంటేషన్ ఇస్తామని వెల్లడించారు. పార్టీ శ్రేణులకు 300 రోజుల పాటు నిరంతరాయం ఓరియంటేషన్ ఉంటుందన్నారు. జిల్లాలవారీగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ముచ్చటించుకుంటున్నామని చెప్పారు. రాజకీయాంశాలను ప్రస్తావించడం లేదన్నారు. తెలుగుదేశం కుటుంబంలా ఒకటిగా ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధుల్లో 50 శాతం మందివి ప్రేమ వివాహాలేనన్నారు.
జగన్‌ను పట్టుకోమని చెబుతున్నారా?
తిరుమల లడ్డూ వ్యవహారంలో చిల్లర దొంగలను పట్టుకుని గజదొంగను వదిలేస్తున్నారంటూ మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారంటూ ఓ మీడియా ప్రతినిధి చెప్పగా.. అంటే జగన్ గజదొంగ అని బొత్స అంగీకరించారా అని లోకేశ్ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్‌ను పట్టుకోవాలని చెబుతున్నారా అని అడిగారు. గత ప్రభుత్వంలో స్కిల్ డెవల్‌పమెంట్, ఫైబర్‌నెట్, అసైన్‌మెంట్ భూములు, ఇన్నర్ రింగ్‌రోడ్, లిక్కర్, ఇసుక అంశాలపై తమపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. ఈ కేసుల్లో ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపలేదన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన కంపెనీలకు మేలు చేసుకున్నారని.. భారతీ సిమెంట్స్‌కు ప్రయోజనం కల్పించారని, జగన్ పత్రికకు కోట్లాది రూపాయలు ప్రకటనలు ఇచ్చారని అన్నారు. సర్క్యులేషన్ ఆధారంగా ‘ఆంధ్రజ్యోతి’కి అసలు ప్రకటనలే ఇవ్వలేదని లోకేశ్ అన్నారు.