Share News

ఇకపై ఎంపీలతోనూ బాబు ముఖాముఖి!

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:26 AM

ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్న తరహాలోనే ఇకపై ఎంపీలకూ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

ఇకపై ఎంపీలతోనూ బాబు ముఖాముఖి!

  • వారు కూడా పార్టీ కార్యాలయానికి రావాలి: లోకేశ్‌

ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్న తరహాలోనే ఇకపై ఎంపీలకూ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. టీడీపీపీ సమావేశంలో సీఎం 45 నిమిషాల పాటు ఎంపీలతో మాట్లాడి వెళ్లిపోయారు. అనంతరం రెండున్నర గంటలపాటు ఎంపీలతో లోకేశ్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘కొందరు ఎంపీల పనితీరుపై పార్టీ అధినేత అంత సంతృప్తిగా లేరు. మరికొందరు ఎంపీలు తరచూ వివాదాల్లో తలదూరుస్తున్నారు. వారిని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. తరచూ వివాదాలతో రచ్చకెక్కుతున్న, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను గత కొద్ది నెలలుగా సీఎం స్వయంగా పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అదే తరహాలో ఇకపై ఎంపీలతోనూ సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. వాటిలో నేనూ పాల్గొంటా’ అని తెలిపారు. పార్లమెంటు తొలివిడత సమావేశాలు ముగిసిన వెంటనే వీటిని ప్రారంభిద్దామన్నారు. మంత్రులందరూ ఇప్పటికే పార్టీ కార్యాలయానికి వస్తున్నారని, ఇకపై ఎంపీలు కూడా తప్పనిసరిగా రావాలని కోరారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు నడుమ బంధం మరింత బలపడేలా ఎంపీలు వ్యవహరించాలన్నారు. ఎంపీల పనితీరుపై కేంద్రం నుంచి వస్తున్న నివేదికలు బాగున్నా మరింత మెరుగుపరచుకోవాలని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వెల్లడించారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందన్నారు. అక్కడ తాను వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమయ్యానని, వారంతా ఇండియా సరైన మార్గంలో వెళ్తోందని చెప్పడంతోపాటు రాష్ట్రాభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని లోకేశ్‌ ఎంపీలకు వివరించారు.

Updated Date - Jan 26 , 2026 | 03:27 AM