ఏం సార్.. సన్నబడిపోతున్నారు?
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:50 AM
రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీ మధ్య ఆప్యాయ పలకరింపులకు లోక్‌భవన్ వేదికైంది. గత ఏడాది ఎట్ హోం కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉంది.
బొత్సను ఆప్యాయంగా పలుకరించిన లోకేశ్
శారీరకంగా తగ్గుతున్నా.. ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదు: బొత్స
రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీ మధ్య ఆప్యాయ పలకరింపులకు లోక్‌భవన్ వేదికైంది. గత ఏడాది ఎట్ హోం కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉంది. ఈ ఏడాది మాత్రం ఆ పార్టీ తరఫున బొత్స, మరో ఎమ్మెల్సీ ఎం.డి.రుహుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స, లోకేశ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. బొత్సను చూస్తూనే... ‘ఏం సార్.. సన్నబడిపోతున్నారు..! నీరసంగా కనిపిస్తున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది’ అని లోకేశ్ కుశల ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పక్కనే ఉన్నారు. బొత్స స్పందిస్తూ... ‘శారీరకంగా కొంచెం వీక్‌గా ఉన్నా.. రాజకీయంగా ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదు’ అని సమాధానమిచ్చారు. ‘ఆరోగ్యం జాగ్రత్త సార్’ అని లోకేశ్ మరోసారి ఆప్యాయంగా చెప్పారు. కార్యక్రమం మధ్యలోనే బొత్స, రుహుల్లా వెళ్లిపోయారు.