ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది!
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:25 AM
జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా అయిన నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని, వెజిటబుల్ ఆయిల్‌న్నట్లు తేలిందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు.
సిట్ చార్జిషీటులో స్పష్టంగా ఉంది
అయినా వైసీపీ కొత్త డ్రామా.. అసలా పార్టీ మొత్తం కల్తీయే
జగన్ సినిమాల్లోకి వెళ్తే భాస్కర్ అవార్డు వచ్చేది: లోకేశ్
కాకినాడలో కార్యకర్తలతో.. ఉండవల్లిలో టీడీపీ నేతలతో సమావేశం
కాకినాడ/అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా అయిన నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని, వెజిటబుల్ ఆయిల్‌న్నట్లు తేలిందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండ్రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలుచేసిన చార్జిషీటులోని పేజీ నంబరు 35లో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. అయినా వైసీపీ ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టిందని మండిపడ్డారు. ప్రజలకు ఈ వాస్తవాలు వివరించి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టణ, వార్డు, మండల స్థాయి టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ బ్యాచ్ క్యాడర్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న నేతలతోనూ ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు, టీటీడీల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. చేయకూడని పాపాలు చేసి.. ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దాని తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి.. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనన్నారు. ‘వైసీపీ కల్తీ పార్టీ. కింది నుంచి పైవరకు మొత్తం కల్తీగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం, కల్తీ నెయ్యి సరఫరాకు తెగబడింది. అంతకుముందు కోడికత్తి డ్రామాలు, బాబాయ్ హత్య వంటి కుట్రలు చాలా చేసింది. ఇప్పుడు కూడా అలాంటి కుట్రల డ్రామాలు చేయడానికి చూస్తోంది. టీడీపీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి’ అని పిలుపిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ కాకుండా భాస్కర్ అవార్డు ఇచ్చేవారని ఎద్దేవా చేశారు.
2019 వరకు టీటీడీకి నాణ్యమైన నెయ్యి సరఫరాకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. ‘అప్పట్లో టెస్టింగ్ చేసి పద్ధతి ప్రకారం వెళ్లాం. నాణ్యమైన నెయ్యి కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఎక్కువ శాతం నెయ్యి కొన్నాం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక చిన్న కంపెనీలకు నెయ్యి ఆర్డర్లు వచ్చేలా టెండర్ నిబంధనలు మార్చారు. 2022లో శాంపిల్ తీసుకుని పరీక్షిస్తే ఫెయిల్ అయింది. ఆ రిపోర్టు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చాక నెయ్యి శాంపిల్స్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా పరీక్ష చేయిస్తే నిజాలు వెలుగులోకి వచ్చాయి’ అని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు మనం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నామని లోకేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా.. వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డామని.. నాటి ఓటమికి అది కూడా కారణమని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు.