Justice Gannamaneni Ramakrishna Prasad: ఏ స్థాయిలో ఉన్నా మూలాలను మరవొద్దు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:47 AM
ప్రపంచంలో ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మన మూలలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును మరిచిపోకూడదని..
సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాషను కాపాడుకోవాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్
విశాఖలో లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం
డాబాగార్డెన్స్ (విశాఖ సిటీ), జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మన మూలలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును మరిచిపోకూడదని.., భావితరాలకు కూడా ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, హరివంశరాయ్‌బచ్చన్‌ల పుణ్యతిథి, లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని విశాఖపట్నం దసపల్లా హోటల్లో లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ...మన సంస్కృతి, సంప్రదాయాలను, తెలుగు భాషను కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇంగ్లీష్ పై ఉన్న మక్కువతో తెలుగు భాషను పక్కన పెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ...వివిధ రంగాల్లో నిష్ణాతులకు లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా 22 సంవత్సరాలుగా పురస్కారాలను అందజేయడం స్ఫూర్తిదాయకమన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రముఖ నటి ప్రభ తదితరులు ప్రసంగించారు. అనంతరం లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం కింద ప్రముఖ రచయిత డాక్టర్ వెలమల సిమ్మన్నకు రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక వ్యవస్థాపకులు తోటకూర ప్రసాద్, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి, డాక్టర్ వేములపల్లి రాఘవేంద్రచౌదరి, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తరపున డాక్టర్ జి.భాస్కరరావుకు లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.