Share News

ఎస్‌ఈజెడ్‌లో స్థానికులకే ఉద్యోగాలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:39 AM

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం ఎస్‌ఈజెడ్‌ కాలనీలో గురువారం నిర్వహించిన ‘అక్షరం అండగా, సమస్యల పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రశ్నకు స్థానిక ఎమ్మెల్యే సుందరపు స్పందన ఇది

ఎస్‌ఈజెడ్‌లో స్థానికులకే ఉద్యోగాలు

  • నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలిస్తాం

  • ఎంప్లాయిమెంట్‌ సెల్‌ ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే సుందరపు

  • అనకాపల్లి జిల్లా దిబ్బపాలెంలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’

  • ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం

  • పాలకుల దృష్టికి ప్రజల సమస్యలు

  • పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవ

అచ్యుతాపురం, మార్చి 12(ఆంధ్రజ్యోతి):

స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఈజెడ్‌ కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించండి

- నీరుకొండ నరసింగరావు, ఎంపీటీసీ సభ్యుడు

నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇందుకోసం ఇక్కడే ఎంప్లాయ్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు చేస్తాం.

- ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌

నకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం ఎస్‌ఈజెడ్‌ కాలనీలో గురువారం నిర్వహించిన ‘అక్షరం అండగా, సమస్యల పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రశ్నకు స్థానిక ఎమ్మెల్యే సుందరపు స్పందన ఇది. దిబ్బపాలెం సచివాలయ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ సమస్యలు తెలియజేశారు. తమ గ్రామంలో మంచినీటి ప్లాంటు పనిచేయకపోవడంతో కలుషిత నీరు తాగాల్సి వస్తున్నదని, దాంతో కీళ్లవ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని లాలం శ్యామలాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ లారస్‌ ల్యాబ్స్‌ కంపెనీతో మాట్లాడి కొత్త వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేయిస్తామన్నారు. గ్రామం లో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉందని లాలం రాజు చెప్పగా.. దిబ్బపాలేన్ని రూర్బన్‌ పంచాయతీగా ప్రభుత్వం గుర్తించిందని, త్వరలో మురుగు సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే చెప్పారు.


దిబ్బపాలెంలో స్మార్ట్‌ డిజిటల్‌ లైబ్రరీలు, స్మార్ట్‌ హెల్త్‌ జిమ్‌లు ఏర్పాటు చేయాలని విద్యావేత్త రుత్తల శ్రీను కోరగా, ఎమ్మెల్యే ఆమేరకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘ఆంధ్రజ్యోతి’ ఇటువంటి చర్చా వేదికలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ (డీజెడ్‌ఎం) సూర్యనారాయణ, ఎంపీడీఓ చిన్నారావు, డీటీ శ్యామ్‌, ఏఈ శ్రీనివాస్‌, పలు శాఖల అధికారులు, సెజ్‌ పునరావాస కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బైలపూడి రామదాసు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ‘ఆంధ్రజ్యోతి’ విశాఖ యూనిట్‌ మేనేజర్‌ కె.రామకృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 04:40 AM