లోక్‌భవన్‌లో అంతా తానై..
ABN , Publish Date - May 02 , 2026 | 04:35 AM
ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు ఎక్కడెలా వ్యవహరించాలో గుర్తెరిగి ఉండాలి. మరీ ముఖ్యంగా గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి వద్ద విధులు నిర్వహించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
పరిధి దాటిన గవర్నర్ మాజీ ఏడీసీ
సిబ్బంది పట్ల దురుసు ప్రవర్తన
సెక్రటరీలనూ శాసించే స్థాయికి
గవర్నర్‌తో కలవనివ్వని వైనం
రామాంజనేయులుపై బదిలీ వేటు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు ఎక్కడెలా వ్యవహరించాలో గుర్తెరిగి ఉండాలి. మరీ ముఖ్యంగా గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి వద్ద విధులు నిర్వహించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ గవర్నర్ వద్ద ఏడీసీ (ఎయిడ్-డి-క్యాం్‌ప)గా విధులు నిర్వహించిన ఎన్.వి.రామాంజనేయులు తన పరిధి దాటి ప్రవర్తించారు. గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో రామాంజనేయులు కూడా గవర్నర్ ఏడీసీగా బాధ్యతలు తీసుకున్నారు. మొదటినుంచి ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న ఆయన లోక్‌భవన్‌లో అంతా తానై వ్యవహరించారు. లోక్‌భవన్‌లో విధులు నిర్వహించేవారిపై గవర్నర్‌కు సర్వాధికారులు ఉంటాయి. ఆయన తర్వాత లోక్‌భవన్‌లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అధికారాలు ఉంటాయి. కానీ లోక్‌భవన్‌లో ఏడీసీనే సర్వాధికారాలు చెలాయించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా గవర్నర్‌ను కలవాలంటే ఏడీసీ అనుమతిచ్చేవారు కారు. ‘గవర్నర్ రెస్ట్‌లో ఉన్నారు.. ఇప్పుడు కలవడం కుదరదు’ అని చెప్పేవారు. అంతేగాక లోక్‌భవన్‌లో సిబ్బంది అంతా తన కంట్రోల్‌లో ఉండాలని అనధికారిక హుకుం జారీ చేశారు. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించేవారు. తన అనుమతి లేకుండా లోక్‌భవన్‌లో ఏమీ జరగకూడదని నిబంధనలు పెట్టారు. చివరికి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీని కూడా శాసించే విధంగా ప్రవర్తించారు. గవర్నర్ కుటుంబ సభ్యుల పట్ల కూడా అమర్యాదగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. స్వయంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏడీసీని పంపించేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనను బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులిచ్చింది.
నియామకమే విరుద్ధం
లోక్‌భవన్‌లో గవర్నర్ ఏడీసీగా రామాంజనేయులు నియామకమే సక్రమంగా జరగలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనను నియమించారు. సాధారణంగా ఏడీసీ నియామకానికి మొదట ప్రభుత్వం డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను ఎంపిక చేసి, ముగ్గురు పేర్లను గవర్నర్‌కు పంపిస్తుంది. గవర్నర్, లోక్‌భవన్ సెక్రటరీ ముగ్గురితో ప్రత్యేకంగా మాట్లాడుతారు. సర్వీస్ మొత్తం క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం గవర్నర్ ఎంపిక చేసిన ఒక అధికారి పేరును ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ అధికారినే ఏడీసీగా ప్రభుత్వం నియమిస్తుంది. రామాంజనేయులు విషయంలో ఈ ప్రక్రియ జరగలేదు. అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వడం, ఆయన విధుల్లో చేరిపోవడం జరిగిపోయాయి.