Livestock Insurance: పశు బీమా.. రైతుకు ధీమా
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:21 AM
ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు మరణిస్తే.. పశుపోషకులు నష్టపోకుండా వారిని ఆర్థికంగా ఆదుకునేది పశు బీమా పథకమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
ప్రీమియంలో 85శాతం రాయితీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు మరణిస్తే.. పశుపోషకులు నష్టపోకుండా వారిని ఆర్థికంగా ఆదుకునేది పశు బీమా పథకమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం నష్టపరిహారం మాత్ర మే.. ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం వచ్చా క ఏకంగా 85శాతం ప్రీమియం రాయితీతో బీమా పథకాన్ని ప్రారంభించింది. పశుపోషకులు కేవలం 15శాతం ప్రీమియం చెల్లి స్తే సరిపోతుంది. ఈనెల 19నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉచిత పశువైద్య శిబిరాల్లో అర్హత ఉన్న పశువులకు బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ పథకంలో ఇంకానమోదుకాని పశుపోషకుల వివరాలను నమోదు చేయనున్న ట్లు అధికారులు తెలిపారు.
నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ
పశు బీమా పరిహారం లబ్ధిదారులైన పశుపోషకుల బ్యాంకు ఖాతాలకు నేరు గా జమ అవుతుంది. కూటమి ప్రభు త్వం వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,59,453 పశువులకు బీమా వర్తింపజేశారు. 9,036 చనిపోయిన పశువులకు బీమా పరిహారంగా రూ.19,65,89,470 నేరుగా పశుపోషకుల బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్లు పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు తెలిపారు.
ప్రీమియం చెల్లింపు ఇలా..
ఒక్కొ మేలురకం పశువుకు రూ.30వేలు, సంకర జాతి పశువులకు రూ.15వేలు, జీవాలకు రూ.6వేలు బీమా పరిహారం అందించనున్నారు. రూ.30వేల విలువైన పశువుకు బీమా ప్రీమియం రూ.1,920 చె ల్లించాలి. దీనిలో కేంద్ర, రాష్ట్రాలు రూ.1,632(85శాతం) భరిస్తాయి. మిగిలిన కేవలం రూ.288(15శాతం) పశుపోషకులు చెల్లిస్తే చాలు!. గత ప్రభుత్వంలో బీమా ప్రీమియం రూ.384 వసూలు చేశారు. ఇక ఇప్పుడు దేశవాళీ రకం పశువులకు రూ.15వేల బీమాకు ప్రీ మియం రూ.960 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. మిగితా రూ.144 పశుపోషకులు చెల్లించాలి. సన్న జీవాలకు ప్రీమియం వరుసగా 1,2,3 ఏళ్ల కాలానికి బీమా చేస్తారు. తొలి ఏడాది రూ.6 వేల బీమాకు 3శాతం ప్రీమియం కింద రూ.153 రాయి తీ లభించనుండగా, లబ్ధిదారు రూ.27 చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా గరిష్ఠంగా 10 ఆవులు లేదా గేదెలు, 100 జీవాలు, 50 పందులకు వర్తిస్తుంది.