Share News

కొంచెంకొంచెంగా.. కొట్టేశారు!

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:30 AM

మచిలీపట్నంలోని ఆశీర్వాదపురం దిమ్మలసెంటరు గిరిజన కాలనీలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూమిపై అక్రమార్కులు కన్నేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ఈ స్థలాన్ని ఆక్రమించడం, ఆ తర్వాత తప్పుడు పత్రాలు పుట్టించి అమ్ముకొని సొమ్ముచేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతూ వస్తున్నారు. దీంతో సామాజిక అవవసరాల కోసం కేటాయించిన భూమి కాలక్రమంలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సెంటు భూమిని ఏడెనిమిది లక్షల రూపాయల ధరగా నిర్ణయించి అక్రమార్కులు తమ సొంత భూమిలా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా మిగిలిన స్థలం కూడా ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొంచెంకొంచెంగా.. కొట్టేశారు!

- సామాజిక అవసరాలకు కేటాయించిన 40 సెంట్లు మాయం

- తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మరీ విక్రయాలు

- ఆశీర్వాదపురం దిమ్మలసెంటరులో తాజాగా మిగిలినస్థలం ఆక్రమణకు యత్నం

- అధికార, ప్రతిపక్ష నాయకుల కన్నుసన్నల్లోనే వ్యవహారం

- పట్టించుకోని అధికారులు

మచిలీపట్నంలోని ఆశీర్వాదపురం దిమ్మలసెంటరు గిరిజన కాలనీలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూమిపై అక్రమార్కులు కన్నేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ఈ స్థలాన్ని ఆక్రమించడం, ఆ తర్వాత తప్పుడు పత్రాలు పుట్టించి అమ్ముకొని సొమ్ముచేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతూ వస్తున్నారు. దీంతో సామాజిక అవవసరాల కోసం కేటాయించిన భూమి కాలక్రమంలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సెంటు భూమిని ఏడెనిమిది లక్షల రూపాయల ధరగా నిర్ణయించి అక్రమార్కులు తమ సొంత భూమిలా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా మిగిలిన స్థలం కూడా ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నంలోని దిమ్మలసెంటరులో ఖాళీగా ఉన్న భూమిని ఒక్కో కుటుంబానికి నాలుగు సెంట్లు చొప్పున 1989లో 90 మంది గిరిజన కుటుంబాలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చారు. ఇక్కడ నివాసం ఏర్పరచుకొని గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఇళ్లస్థలాలకు పోగా మరో 40 సెంట్ల భూమిని కాలనీలో సామాజిక అవసరాల కోసం కేటాయించారు. కొంతకాలం పాటు ఈ భూమి అలానే ఉంది. కొందరు స్వార్థపరులు, ద్వితీయశ్రేణి రాజకీయ నాయకులు ఈ స్థలంపై క న్నేశారు. మూడు సెంట్లు, ఐదు సెంట్లు చొప్పున విడతల వారీగా ఆక్రమించుకున్న స్థలానికి తప్పుడు పత్రాలు పుట్టించి ఈ స్థలం తమదేనని నమ్మించారు. స్థలం ఆక్రమించిన వారు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ స్థలాన్ని నలుగురైదుగురు కొనుగోలు చేసినట్లుగా పత్రాలు పుట్టించారు. దీంతో కాలనీలోని స్థలంలో నిర్మాణాలు చేస్తుంటే స్థానికులు ప్రశ్నించగా, ఫలానా వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని, గతంలో ఈ స్థలాలు అనేకమంది చేతులు మారిందని, ఎలాంటి పత్రాలు లేకుంటే ఇంతమంది ఎందుకు కొనుగోలు చేస్తారని, కావాలంటే పత్రాలు చూడాలని తమదైనశైలిలో చెబుతూ వస్తున్నారు. దీంతో ఇక్కడి స్థలంలో కొందరు వ్యక్తులు ఆక్రమించేసి భవనాల నిర్మాణం ప్రారంభిస్తే స్థానికులు మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్‌ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించి మునిసిపాలిటీ రికార్డులలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలంగా నమోదై ఉందని, భవనాల నిర్మాణాలను పునాదులతో సహా తొలగించి నిర్మాణాలను నిలిపివేశారని స్థానికులు చెబుతున్నారు.

స్థానికులు అడ్డుపడ టంతో విషయం వెలుగులోకి..

వైసీపీ ప్రభుత్వ హయాంలో దిమ్మలసెంటరులోని మునిసిపల్‌ స్థలాన్ని కొందరు ఆక్రమించేసి, ఆపై తప్పుడు పత్రాలు పుట్టించారు. ఈ పత్రాలు చూపి వేరే వ్యక్తులకు ఈ స్థలాలను విక్రయించేశారు. ఈ ప్రక్రియలో ఎవ్వరూ అడ్డుచెప్పకుండా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులను తమతో కలుపుకొని మరీ వ్యూహాత్మకంగా వ్యవహరించి మునిసిపల్‌ స్థలాన్ని ఆక్రమించేయడం గమనార్హం. ఈ స్థలాలను ఆక్రమించుకున్న వారు గుట్టుచప్పుడు కాకుండా వేరే వ్యక్తులకు విక్రయించేసి సొమ్ముచేసుకున్నారు.

నాలుగు రోజుల క్రితం జేబీసీతో చదును

ఈ స్థలంలో నాలుగు సెంట్ల భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి రెండు రోజుల క్రితం జేసీబీని తీసుకువచ్చి స్థలాన్ని చదునుచేసే పనులు చేపట్టారు. జనసేనకు చెందిన స్థానిక కార్యకర్తలు మునిసిపల్‌ స్థలాన్ని బయటి వ్యక్తులు వచ్చి చదును చేస్తుండటంతో ఆరా తీశారు. సంబంధిత వ్యక్తితో మాట్లాడితే తాను ఈ స్థలాన్ని రూ.30 లక్షలకుపైగా ధర చెల్లించి కొనుగోలు చేశానని, తనకు రాజకీయంగా పలుకుబడి ఉందని, తనను ఎవ్వరూ ఏం చేయలేరని, ఈ స్థలంలో ఇల్లుకట్టి చూపిస్తానని తనదైన శైలిలో చెప్పడంతో జనసేన కార్యకర్తలు మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిమ్మలసెంటరులో మునిసిపల్‌ స్థలం విక్రయించేశారనే విషయం బయటకు వచ్చింది. సామాజిక అవసరాలకోసం కేటాయించిన స్థలాన్ని వేర్వే వ్యక్తులు తమ సొంత ఆస్తిలా విక్రయించేయడంతో మునిసిపల్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Updated Date - Mar 23 , 2026 | 12:31 AM