‘లిక్కర్’ రవాణా నిందితులను 20న తీసుకురండి
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:37 AM
రాష్ట్రంలో మద్యం రవాణాలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేయడంతో ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉన్న..
సిట్ పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి
విజయవాడ, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం రవాణాలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేయడంతో ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉన్న ముగ్గురు కీలక నిందితులను ఈ నెల 20న కోర్టులో హాజరుపరచడానికి విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. మద్యం రవాణాలో జరిగిన అక్రమాలపై సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
బెయిల్ కోసం హైకోర్టుకు వాసుదేవరెడ్డి
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణాలో అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కీలక నిందితుడు, అప్పటి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి (ఏ1) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో వాసుదేవరెడ్డితో పాటు మద్యం కేసు కీలక నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.