Share News

‘మద్యం’ కోట్ల కోసం ముఠా కొట్లాట

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:39 AM

గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో ఎన్నెన్నో సిత్రాలు బయటపడుతున్నాయి. ముడుపుల సొమ్ములో నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడం..

‘మద్యం’ కోట్ల కోసం ముఠా కొట్లాట

  • వాటాల్లో తేడా రావడంతో కసిరెడ్డి, శరత్‌ బాహాబాహీ

  • ‘సిట్‌’ కస్టడీలో గుట్టు విప్పిన ముప్పిడి అవినాశ్‌ రెడ్డి

  • శరత్‌చంద్రా రెడ్డి.. విజయసాయి అల్లుడి సోదరుడు

  • ముప్పిడి అవినాశ్‌ రెడ్డి.. రాజ్‌ కసిరెడ్డికి తోడల్లుడు

  • మొత్తం వ్యవహారం నడిపింది రాజ్‌ కసిరెడ్డే

  • ముంబై హవాలా సొమ్మంతా అంతిమ లబ్ధిదారు కోసమే

  • సీసాలు, మూతలు, అట్టపెట్టెల్లోనూ అక్రమాలని వెల్లడి

అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో ఎన్నెన్నో సిత్రాలు బయటపడుతున్నాయి. ముడుపుల సొమ్ములో నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడం.. డెన్లలో నోట్ల కట్టలు దాయడం.. భారీగా ఆస్తులు, బంగారం కొనుగోలు చేయడం.. మనీలాండరింగ్‌కు పాల్పడటం.. నిందితుల ఇళ్లలో దాచిన నోట్ల కట్టలను పనిమనుషులు కొట్టేయడం.. వంటివి సిట్‌ దర్యాప్తులో వెలుగు చూశాయి. లిక్కర్‌ ధరలు భారీగా పెంచి పేదల నుంచి దోచుకున్న సొమ్ము కోసం మద్యం ముఠా బాహాబాహీకి దిగినట్లు తాజాగా బయటకొచ్చింది. వాటాల పంపిణీలో తేడాలు రావడంతో అసలు సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి(ఏ-1), పెట్టుబడిదారు శరత్‌చంద్రారెడ్డి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ముప్పిడి అవినాశ్‌ రెడ్డి(ఏ-7) సిట్‌ విచారణలో ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో దర్యాప్తు అధికారులు అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించారు. రాజ్‌ కసిరెడ్డికి ఆయన తోడల్లుడు. ముడుపుల రూపంలో వచ్చిన సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా తరలించడం, వ్యాపారం ద్వారా జరిపిన లావాదేవీలపై సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన విచారణలో అవినాశ్‌రెడ్డి కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసింది.


గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌, ఇతర బాగోతాలన్నీ రాజ్‌ కసిరెడ్డికి తెలుసునని చెప్పినట్లు సమాచారం. ఆదాన్‌, ఎస్‌పీవై, లీలా డిస్టిలరీస్‌ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ముంబైకి చెందిన ప్రొఫెషనల్‌ హవాలా ఏజెంట్ల పేర్లు సూచించింది అంతిమ లబ్ధిదారులేన్న సంచలన విషయాన్ని అవినాశ్‌ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. మద్యం ముఠా సభ్యులు తీసుకున్న సొమ్ము మార్పిడికి హైదరాబాద్‌లోనే తగిన అవకాశాలున్నాయని, ముంబైకి చెందిన చోఖ్రా లావాదేవీలన్నీ ‘పెద్దల’కు సంబంధించిన సొమ్ములేనని వివరించినట్లు సమాచారం.


అంతా రాజ్‌ కసిరెడ్డికి తెలుసు

‘మాది చాలా పెద్ద కుటుంబం. మా తాతలు జమీందార్లు. కూకట్‌పల్లి ప్రాంతంలో ఒకప్పుడు మెజారిటీ ఆస్తులు మావే. మాకు హైదరాబాద్‌లో మద్యం షాపులున్నాయి. నేను, నా తమ్ముడు అనిరుధ్‌ రెడ్డి చూసుకుంటాం. రాజ్‌ కసిరెడ్డి మరదలిని పెళ్లి చేసుకున్న నేను బంధువుగా అతని ఇంటికి వెళ్లినప్పుడు మద్యం వ్యవహారం గురించి విన్నాను. వ్యాపారం గురించి రాజ్‌ను అడిగాను. సొంతంగా ఏదో ఒక మద్యం బ్రాండ్‌ రిజిస్టర్‌ చేసి ఉత్పత్తి చేస్తే ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులకు సరఫరా చేయవచ్చని చెప్పాడు. లక్ష రూపాయలతో ఆదాన్‌ డిస్టిలరీస్‌ ప్రారంభించాం. అందులో నన్ను మరో వ్యక్తిని డైరెక్టర్లుగా పెట్టారు. విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రా రెడ్డి తరఫున ఆ వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి లైసెన్స్‌ లేకుండా మద్యం ఉత్పత్తి ప్రారంభించారు. అందుకు పెట్టుబడి రూ.76 కోట్లు శరత్‌చంద్రా రెడ్డి సమకూర్చారు. కొన్నాళ్లపాటు వ్యాపారం బాగా జరిగింది. ఎస్పీవై డిస్టిలరీ, లీలా డిస్టిలరీని స్వాధీనం చేసుకున్నారు. లాభాల్లో వాటాల దగ్గర రాజ్‌ కసిరెడ్డికి, శరత్‌చంద్రా రెడ్డికి మధ్య పెద్ద గొడవలయ్యాయి. ఇద్దరూ బాహాబాహీకి దిగారు. దీంతో నేను డైరెక్టర్‌గా ఉండలేనని తప్పుకొన్నా. నా స్థానంలో కాశీచైనుల శ్రీనివా స్‌ను చేర్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలీదు. రాజ్‌ కసిరెడ్డికే తెలుసు’ అని అవినాశ్‌ రెడ్డి వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే లిక్కర్‌ స్కామ్‌ వెలికి తీస్తామంటూ కూటమి పెద్దలు సీఐడీకి కేసు అప్పగించారు. రాజ్‌ కసిరెడ్డి ఇంటికెళ్లి మాట్లాడాను. కొన్నాళ్ల పాటు దేశం వదిలి వెళ్లిపో.. సద్దుమణిగాక తిరిగి రావచ్చని చెప్పడంతో వెళ్లిపోయాను. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగిరాక తప్పలేదు’ అని వెల్లడించాడు. అవినాశ్‌ రెడ్డిని మరో రెండు రోజుల పాటు సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 04:41 AM