Share News

జగన్‌ మీడియాకు ఎంత కష్టమో!

ABN , Publish Date - May 30 , 2026 | 04:29 AM

అవినీతి చేయడం.. బయటపడ్డాక తూచ్‌ తాము కాదంటూ అబద్ధాలు చెప్పడం.. వాస్తవాలను బుకాయించడంలో వైసీపీ నేతలకు బహుశా దేశంలోనే ఎవరూ సాటి రారేమో

జగన్‌ మీడియాకు ఎంత కష్టమో!

  • అరాచకశక్తుల్ని వెనకేసుకురాలేక ప్రయాస

  • బాలాజీ గోవిందప్ప నుంచి కేఎన్‌ఆర్‌ వరకూ..

  • భారతి సిమెంట్స్‌లో గోవిందప్ప శాశ్వత డైరెక్టర్‌

  • మద్యం కేసులో అరెస్ట్‌ కాగానే కాదంటూ కథలు

  • జగన్‌కు కేఎన్‌ఆర్‌ వ్యక్తిగత సహాయకుడు

  • వందల కోట్ల అక్రమాలు బయటపడగానే.. తూచ్‌

  • పీఏ కాదు.. పొలిటికల్‌ అసిస్టెంట్‌ అట

  • రోత మీడియా రాతలతో నవ్వుకుంటున్న జనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అవినీతి చేయడం.. బయటపడ్డాక తూచ్‌ తాము కాదంటూ అబద్ధాలు చెప్పడం.. వాస్తవాలను బుకాయించడంలో వైసీపీ నేతలకు బహుశా దేశంలోనే ఎవరూ సాటి రారేమో! అరాచకశక్తుల్ని వెనకేసుకురాలేక.. అసలు తమకు సంబంధమే లేదన్నట్టుగా అడ్డగోలు కథనాలు అల్లడానికి పాపం జగన్‌ రోత మీడియా పడరాని పాట్లు పడుతోంది. భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప నుంచి జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డి(కేఎన్‌ఆర్‌) వరకూ ఇదే వరుస. వాళ్లు తమ వాళ్లు కాదని చెప్పడానికి ఆపసోపాలు పడుతోంది. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన వైసీపీ ఐదేళ్ల పాలనను భరించలేని రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించడంతో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద స్కామ్‌లలో మద్యం కుంభకోణం ఒకటి. ఈ కేసులో నిందితుల్ని అరెస్టు చేసిన సిట్‌ అధికారులు.. భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప కోసం దేశమంతా వెతికి కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని జైలుకు పం పారు. కడప జిల్లాలో రఘురామ సిమెంట్స్‌ను జగన్‌ లాక్కొని భార్య పేరిట కంపెనీని మార్చుకున్న విషయం జగమెరిగిన సత్యం. భారతీ సిమెంట్స్‌లో బాలాజీ గోవిందప్ప 2010 నుంచి పూర్తికాలం డైరెక్టర్‌గా ఉంటూ సిమెంటు వ్యాపార లావాదేవీల ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్‌ కసిరెడ్డితో కలిసి ముడుపుల వసూళ్ల ప్రక్రియకు రూపకర్త అయిన ఆయన మద్యం మాఫియాతో పలుమార్లు ఆర్థిక వ్యవహారాలపై చర్చించి ప్రతి వారం అంతిమలబ్ధిదారు వాటా ముడుపులు తీసుకెళ్లేవారని సిట్‌ కోర్టుకు వివరించింది. ఇంత స్పష్టంగా దర్యాప్తు బృందం కోర్టుకు వివరిస్తే.. జగన్‌ సొంత పత్రికలో మాత్రం ఆయన ఫ్రెంచ్‌కు చెందిన సిమెంట్‌ ఉత్పత్తిదారు ‘వికాట్‌ గ్రూప్‌’నకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. భారతీ సిమెంట్స్‌తో భాగస్వామ్యం చేసుకున్న వికాట్‌ గ్రూప్‌నకు చిత్తూరు జిల్లాలో వైసీపీ జిల్లా స్థాయి నాయకుడి సోదరుడికి సంబంధం ఏంటో? అన్నింటికన్నా ముఖ్యంగా లిక్కర్‌ స్కామ్‌ ముడుపులు తీసుకోవాల్సిన అవసరం వికాట్‌ గ్రూపునకు ఎందుకుంటుంది? అన్నీ తెలిసినా తాము నిజాయతీపరులమని చెప్పుకోవడానికి జగన్‌ మీడియా పడుతున్న యాతన అంతా ఇంత కాదు. తాజాగా జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌ విషయంలోనూ రోత మీడియా ఇలాగే వ్యవహరించింది.


కేఎన్‌ఆర్‌.. జగన్‌ పీఏ కాదట

లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు జగన్‌ వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వర రెడ్డి(కేఎన్‌ఆర్‌)ని ఈ నెల 27, 28 తేదీల్లో విచారించారు. ఈ వార్త ప్రచురించిన జగన్‌ పత్రిక కేఎన్‌ఆర్‌ను జగన్‌కు పీఏగా కాకుండా పొలిటికల్‌ అసిస్టెంట్‌(పీఏ)గా అభివర్ణించింది. కేఎన్‌ఆర్‌ అడ్డంగా దొరికిపోవడంతో అతడికి జగన్‌తో సంబంధాలు లేవని కప్పిపుచ్చేందుకు జే మీడియా పురిటి నొప్పులు పడుతోంది. జగన్‌కు కేఎన్‌ఆర్‌ పీఏ అన్న విషయం వైసీపీలో చాలామందికి తెలుసు. అయినా దాయడానికి జగన్‌ మీడియా నానా పాట్లు పడుతోంది. లిక్కర్‌ స్కామ్‌ అంతా కూటమి ప్రభుత్వం కుట్ర అంటూ వాపోయిన జగన్‌ మీడియా కేఎన్‌ఆర్‌ను మాత్రం అసలు పీఏనే కాదని తేల్చేసింది. ఈ వార్త చూసి వైసీపీ కూలి మీడియా సైతం ఇది పద్ధతి కాదంటూ వ్యతిరేకించింది. జగన్‌ పర్యటనల వివరాలు వారం రోజుల క్రితం వరకూ ఆయా జిల్లాల నేతలకు ఆయన పీఏ కేఎన్‌ఆర్‌ పేరిట విడుదలయ్యాయని వెల్లడించింది. జగన్‌తో వైసీపీ కార్యకర్త ఫొటో దిగాలన్నా ‘నాకేంటి?’ అని డబ్బులు వసూలు చేసే నైజం కేఎన్‌ఆర్‌ది. ఇంకా జగన్‌ అపాయింట్మెంట్‌కు ఐదు లక్షలు, ఎన్నికల్లో టికెట్‌ కోసం ఐదు కోట్లు వసూలు చేశారంటూ వైసీపీలోని కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


చిన్న అప్పన్న.. సుబ్బారెడ్డి పీఏ కాదట

గత ప్రభుత్వంలో తిరుమల వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యకు ఉపక్రమించిన వైసీపీ పెద్దలు అసలు గుట్టు బయటపడగానే బుకాయింపు మొదలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌ చిన్నాన్న, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న పాత్ర వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలో సిట్‌ కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేసింది. దీంతో దిక్కుతోచని సుబ్బారెడ్డి అసలు చిన్న అప్పన్న తన పీఏనే కాదంటూ మీడియా ముందు వాదించారు.


జగన్‌కు సొంత మీడియా లేదట

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘సిద్ధం’ పేరుతో జగన్‌ భారీ సభలు ఏర్పాటు చేసి తనకు సొంత మీడియా లేదని, పత్రిక, టీవీ కూడా లేవని బహిరంగంగా ప్రకటించారు. జనం నవ్వుకుంటారని కూడా అనుకోకుండా అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు ఓ వర్గం మీడియా ఉందని, తనకు మాత్రం ఏమీ లేదంటూ పదే పదే చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నిండు అసెంబ్లీలో తమకు సొంత మీడియా ఏర్పాటు చేసుకొంటున్నామంటూ వైఎస్ఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో వెల్లడించారు. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో సాక్షి పత్రిక, టీవీ.. తండ్రి మేళ్లకు ప్రతిఫలంగా పుట్టినవేనని దర్యాప్తు సంస్థ కోర్టుకు వివరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం జగతి పబ్లికేషన్స్‌ ఖాతాలు స్తంభింపజేసింది. సాక్షి మీడియా యజమాని ఎవరని గూగుల్‌ను అడిగితే జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి పేరు వస్తుంది. ఆ పత్రిక, టీవీలో వైఎస్ఆర్‌ ఫొటో కనిపించని రోజు ఉండదు. ‘మాట తప్పం.. మడమ తిప్పం.. విశ్వసనీయత’.. ఈ పదాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయినట్లు ఆయన సొంత మీడియా లెక్కలేనన్ని సార్లు జగన్‌కు సంబంధించిన వార్తల్లో ఊదరగొట్టింది. అయితే అవన్నీ ఉత్తుత్తివేనని, అదే మీడియా నుంచి సందర్భోచితంగా వెలువడే కథనాల్లో స్పష్టం అవుతోంది. ఉన్నది ఉన్నట్లు రాయాలంటే ఏ విలేకరికైనా, ఏ పత్రికకైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అక్రమాలు దాచిపెట్టి, దొంగల్ని వెనకేసుకొచ్చి, లేనిపోనివి కల్పించి ఎదుటి వారిపై నింద వేసి వార్త రాయాలంటే ఎంత కష్టమో.. ప్రస్తుతం ఆ వేదన, నొప్పి జగన్‌ సొంత మీడియాలో పనిచేసే పాత్రికేయులు పడుతున్నారు.

Updated Date - May 30 , 2026 | 04:38 AM