మద్యం కేసులో.. సత్యప్రసాద్ ముందస్తు బెయిల్‌పై విచారణ 2కి వాయిదా
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:48 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితులైన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ-2), ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్(ఏ-3) వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో...
చెవిరెడ్డి, సువర్ణరాజు అనుబంధ పిటిషన్లు కొట్టివేత
వాటికి విచారణార్హత లేదని హైకోర్టు స్పష్టీకరణ
వాసుదేవరెడ్డి అరెస్టయినందున ఆయన వ్యాజ్యాన్నీ విచారించనక్కర్లేదని వెల్లడి
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితులైన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ-2), ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్(ఏ-3) వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో తమను ప్రతివాదులుగా చేర్చుకోలని సహ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ-38), మరో థర్డ్‌పార్టీ సువర్ణరాజు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వారి వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. వాసుదేవరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసినందున ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ అవసరం లేదంటూ ఆయన వ్యాజ్యాన్నీ కొట్టివేసింది. సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మార్చి 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ దశలో సత్యప్రసాద్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరారు. సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది మను శర్మ జోక్యం చేసుకుని.. అరెస్టుపై ఆయనకు ఆందోళన అవసరం లేదని తెలిపారు. దీంతో సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. కాగా,అప్రూవర్లుగా మారుతామంటూ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ కోరుతున్నారని.. వారికి బెయిల్ మంజూరు చేయవద్దని చెవిరెడ్డి, థర్డ్‌పార్టీ సువర్ణరాజు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు.
వాసుదేవరెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వండి
ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్
విజయవాడ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. 21వ తేదీన ఆయన్ను అరెస్టు చేయడం.. రిమాండ్‌పై ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సమయంలో జరిగిన కుంభకోణంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని.. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టును అభ్యర్థించింది.