Share News

లిక్కర్‌ కేసులో వాసుదేవరెడ్డికి షరతులతో బెయిల్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:44 AM

మద్యం కుంభకోణంలో ఏ-2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.

లిక్కర్‌ కేసులో వాసుదేవరెడ్డికి షరతులతో బెయిల్‌

  • మరో నిందితుడు ప్రణయ్‌ ప్రకాశ్‌ పిటిషన్‌ కొట్టివేత

విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ-2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. వాసుదేవరెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాద, ప్రతివాదనలు ముగియడంతో న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పును వెలువరించారు. లక్ష రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని, పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని, నెలలో రెండుసార్లు రెండో సోమవారం, నాలుగో సోమవారం సిట్‌ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేయాలని షరతులు విధించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

ముగ్గురి బెయిల్‌ పిటిషన్లపై 24న తీర్పు

మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డితో పాటు పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లపై వాద, ప్రతివాదనలు శుక్రవారం ముగిశాయి. తీర్పును 24న వెలువరిస్తామని న్యాయాధికారి పి.భాస్కరరావు తెలిపారు.

Updated Date - Apr 18 , 2026 | 03:44 AM