ఎంత దోచారో.. ఇంకెంత దాచారో!
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:38 AM
గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ విచారణలో ఒక్కొక్కటిగా రహస్య అక్రమాస్తుల పుట్టలు పగులుతుండటంతో సామాన్య ప్రజలతో పాటు దర్యాప్తు అధికారులు సైతం విస్తుపోతుండగా...
కోటరీ ముడుపులపై ‘ప్యాలె్‌స’లో ప్రకంపనలు
డీల్, పంపకాల్లో మోసం చేశారని ఆగ్రహం?
ప్యాలెస్‌లోకి చెవిరెడ్డి, ఓఎస్డీ, కేఎన్‌ఆర్‌కు ‘నో ఎంట్రీ’
రిటైర్మెంట్ తర్వాత ధనుంజయ రెడ్డి కూడా దూరమే!
ఎన్నికల్లో లిక్కర్ సొమ్ము పంచకుండా దాచేసిన చెవిరెడ్డి
భారీగా ఆస్తులు పోగేసుకున్న కృష్ణమోహన్ రెడ్డి
జగన్ పీఏ కేఎన్‌ఆర్ అక్రమాలు వందల కోట్లలో
సొంత దందాలపై వైసీపీ అధినేతకూ ఫిర్యాదులు
సజ్జలకూ ‘లిక్కర్’ నోటీసులు?
వరుస పరిణామాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
ఒకరికి మించిన వారొకరు! తాడిని తన్నిన వారొకరైతే... దాని తలను తన్నిన వారొకరు! ‘బాస్ తింటే మా కడుపు నిండుతుందా!?’ అంటూ ఎవరికి వారు సొంత దుకాణాలు తెరుచుకున్నారు. ఇందులో... ఐదేళ్ల వైసీపీ హయాంలో జగన్ చుట్టూ ఉన్న కీలక వ్యక్తులు ‘నువ్వా నేనా’ అంటూ పోటీపడ్డారు. మద్యం పాలసీ మార్పు నాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో జరిగిన ఒక బడా స్కామ్! కాగా... కమీషన్ల వసూలు, ఆ ముడుపుల తరలింపులో ఎవరికి వారు చేతివాటం ప్రదర్శించారు. జగన్ సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లీలలు ఇప్పటికే బయటపడ్డాయి. తాజాగా... జగన్‌ను అంటిపెట్టుకుని తిరిగే ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్) విన్యాసాలు మహామహా ముదుర్లే ముక్కున వేలేసుకునే స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. దీంతో... ‘వ్వా...ట్..... ఈజ్ దిస్! ఎవరికివారు ఇంతలా మేశారా’ అంటూ తాడేపల్లి ప్యాలెస్‌లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం! ‘తనను నమ్ముకున్న వాళ్లు ఎంత తప్పు చేసినా మన్నించేస్తారు’ అని జగన్ గురించి ఆయన వీరాభిమానులు గొప్పలు చెబుతుంటారు. కానీ... ఈ ‘లెక్క’ ఇప్పుడు తప్పినట్లు తెలుస్తోంది. తన హయాంలో కోట్లు పోగేసుకున్న వారిని తాడేపల్లి ప్యాలెస్ దూరం పెట్టినట్లు సమాచారం.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ విచారణలో ఒక్కొక్కటిగా రహస్య అక్రమాస్తుల పుట్టలు పగులుతుండటంతో సామాన్య ప్రజలతో పాటు దర్యాప్తు అధికారులు సైతం విస్తుపోతుండగా... వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన పేరు వాడుకుని, తనకు తెలియకుండా ఇన్ని వందల కోట్లు సంపాదించారా అని జగన్ సైతం ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.
వారిపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కేఎన్‌ఆర్ బాధితులు కొందరు నేరుగా జగన్‌కే ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని రోజులుగా తాడేపల్లి, యలహంక ప్యాలెస్‌లలో సొంత పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి కోటరీ అక్రమాల గురించి జగన్ తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. చెవిరెడ్డి మొదలుకొని కేఎన్‌ఆర్ వరకూ కీలక కోటరీని తాడేపల్లి ప్యాలె్‌సలోకి కొన్నాళ్లపాటు రానీయకుండా బ్రేకులు వేసినట్లు సమాచారం. ఇక తన గుట్లు తెలిసిన మరికొందరిని రానీయలేక, వద్దనలేక సతమతమవుతున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నాడు ఎన్నో అక్రమాలు
మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. జగన్ హయాంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఽధనుంజయ్ రెడ్డి భారీగా ఆస్తులు సంపాదించడం.. ఓఎ్‌సడీ కృష్ణమోహన్ రెడ్డి వసూళ్ల సొమ్ముతో ఆయన కుమారుడు కంపెనీలు ఏర్పాటు చేయడం.. పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం మడుపుల నుంచి ఎన్నికల్లో పంచాల్సిన సొమ్మును పక్కదారి పట్టించి విదేశాల్లో మైనింగ్ దాకా వెళ్లడం.. జగన్ పక్కనే ఉంటూ వంగి వంగి వినయం ప్రదర్శించే పీఏ కె.నాగేశ్వర రెడ్డి(కేఎన్‌ఆర్) దేశ విదేశాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేయడం.. వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. జగన్ పాదయాత్రలో ఫొటోలు తీసుకోవడానికి, అధికారంలోకి వచ్చాక అపాయింట్‌మెంట్ ఇప్పించడానికి 50 వేల నుంచి 5 లక్షల వరకూ కేఎన్‌ఆర్ వసూలు చేశారని.. ముఖ్యమంత్రి పీఏగా వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తల్ని వేధించారని ఆరోపణలు వస్తున్నాయి.
చార్జిషీట్‌లో జగన్ పేరు
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే మూడు చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేసిన సిట్ జగన్ పేరు సైతం ఇందులో చేర్చింది. తాడేపల్లి ప్యాలె్‌సలో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో చివరి చార్జిషీట్ దాఖలు చేసే ముందు సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. సిట్ ఇటీవల జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డికి నోటీసు ఇచ్చి తిరుపతి సమీపంలోని కేవీబీ పురం మండలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ వెంచర్ నుంచి పదెకరాలు రిజిస్టర్ చేసుకోవడంపై ప్రశ్నించింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ భూమిని కేవలం రూ.81లక్షలకు కొనుగోలు చేయడం వెనుక ఉన్న రహస్యం మద్యం ముడుపుల వ్యవహారమేనని ఆధారాలు సేకరించింది. ఈ విచారణలో భాగంగా కేఎన్‌ఆర్ బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలు పరిశీలించింది. మాజీ సీఎం పీఏ వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసినట్టు తేలింది. కేఎన్‌ఆర్ బినామీలు మొదలుకొని షెల్ కంపెనీలు, దందాలు, భారీ ఆస్తుల చిట్టా బయట పడింది. మొన్నటి వరకూ కేఎన్‌ఆర్ ఫోన్ చేస్తే మహాభాగ్యం అనుకునే వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు.. ఈ అక్రమ వ్యవహారాలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయోనని భయపడి ఆయన ఫోన్లు ఎత్తడం లేదు. ‘అప్పట్లో మిమ్మల్ని వేధించి తీసుకున్న సొమ్ము గురించి ఇటు సిట్ నోటీసు ఇచ్చి అడిగినా, అటు అధినేత తరఫున ఎవరైనా పార్టీ పెద్దలు ఆరా తీసినా నోరు విప్పొద్దు’ అంటూ వైసీపీ నేతల్ని కేఎన్‌ఆర్ బెదిరించడం, కుదరకపోతే వేడుకోవడం చేస్తున్నారని తెలిసింది.
నోట్ల బ్యాగులు మోసిన ఆఫీస్ బాయ్
ముఖ్యమంత్రి పీఏ హోదాలో భారీగా అక్రమాలకు పాల్పడిన కేఎన్‌ఆర్ ఆస్తుల గుట్టల్ని వెలికి తీస్తున్న సిట్ అధికారులు... వైసీపీ కార్యాలయంలో సహాయకుడు మనోహర్‌ను విచారించడం వెనుక ‘విషయం’ తెలిసి పార్టీ పెద్దలు విస్తుపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేఎన్‌ఆర్ వందల సార్లు ఆఫీస్ బాయ్‌ను వాడుకున్నట్లు తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరి పేర్లు చెప్పి.. ‘ఒకతను నోట్ల కట్టల బ్యాగు ఇస్తాడు.. తీసుకెళ్లి ఇంకొకరికి ఇవ్వు’ అంటూ కేఎన్‌ఆర్ అతడిని వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సిట్ అధికారుల విచారణలో ఏమి చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? అనే దిశగా కేఎన్‌ఆర్ దగ్గరి వ్యక్తులు మనోహర్‌కు శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టెక్నాలజీ సాయంతో పూర్తి ఆధారాలు సేకరించిన సిట్ మనోహర్ నుంచి ఎలాంటి సమాచారం లాగుతుందోనని బ్యాగులు ఇచ్చిన, తీసుకున్న వ్యక్తుల్లో వణుకు మొదలైందని అంటున్నారు.
తాడేపల్లి ప్యాలెస్‌కు దూరం దూరం
మద్యం వాటాల పంపకాల్లో తేడా రావడం, ఎవరికి దొరికింది వారు దోచేసి దారి మళ్లించడం ఇప్పుడు వైసీపీలో చిచ్చురేపుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌కు తెలిసిన సమాచారానికి మించి ఇప్పుడు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కేఎన్‌ఆర్, తదితరులు తన అధికారం, హోదా వాడుకుని విచ్చలవిడిగా సంపాదించడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ‘డీల్’ కుదిరితే ‘మీకెంత.. మాకెంత’ అని ముందుగానే పెద్దలు మాట్లాడుకునేవారని దగ్గరివారు చెబుతారు. అయితే తన కోటరీలోని వ్యక్తులు తక్కువ ‘అమౌంట్’ చెప్పి, ఎక్కువ నొక్కేసినట్టు బయటపడటంతో వారిపై జగన్ మండిపడినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో నాడు జగన్ కోటరీలోని లిక్కర్ స్కామ్ నిందితులు ఒక్కొక్కరుగా తాడేపల్లి ప్యాలె్‌సకు దూరమవుతున్నారు. లిక్కర్ స్కామ్ సొమ్ములో కొంత ఎన్నికల్లో పంచకుండా దారి మళ్లించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ దగ్గరికి రానీయడంలేదు. రిటైరయ్యాక ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి దూరమయ్యారు. తనకు నమ్మకస్తుడుగా ఉన్న ఓఎ్‌సడీ కృష్ణమోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్టయ్యాక దూరంగా పెట్టారు. తనకు తెలియకుండా ఆయన కుమారుడు, కోడలు పేరిట తెలంగాణలో ఆరు వ్యాపార కంపెనీలు ప్రారంభించడం జగన్ ఆగ్రహానికి కారణమైనట్టు తెలుస్తోంది. తాజాగా పీఏ కేఎన్‌ఆర్ బాగోతంపై జగన్ చిందులేసినట్టు సమాచారం. ‘వాడిని తరిమేయండి’ అని ఆగ్రహంతో అన్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మద్యం ముడుపుల్ని దారి మళ్లించి జాగ్రత్తపడ్డ మాజీ సలహాదారు రాజ్ కసిరెడ్డిపైనా జగన్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం తన చుట్టూ ఉన్న వారిని సైతం అనుమానంతో చూస్తున్నట్లు తెలుస్తోంది.
తెరపైకి సజ్జల పేరు?
వైసీపీ ఆఫీసులో పనిచేసే మనోహర్‌కు కూడా సిట్ నోటీసు ఇవ్వడంతో ఇందులో ఇంకెంత మంది పాత్ర ఉంది? ఎవరెవరు ఏ స్థాయిలో దోచుకున్నారు? అన్న సమాచారం కోసం జగన్ పార్టీ నేతలు, శ్రేణులు ఆరా తీస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రకంపనలు పుడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, అక్రమాలు ఇప్పుడు బయట పడుతుండటంతో.. రేపు పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే ఆందోళన జగన్‌లో కనిపిస్తోందని వైసీపీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది.