Share News

Tirumala Liquor Bottles Case: ఇరికిద్దామనుకొని.. అడ్డంగా దొరికారు!

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:00 AM

కూటమి ప్రభుత్వంతో పాటు టీటీడీని, పోలీసులను ఇరుకున పెడదామని స్కెచ్‌ వేశారు. కానీ, సీన్‌ రివర్స్‌ కావడంతో అడ్డంగా దొరికిపోయారు.

Tirumala Liquor Bottles Case: ఇరికిద్దామనుకొని.. అడ్డంగా దొరికారు!

  • తిరుమలలో ఖాళీ మద్యం సీసాల గుట్టు రట్టు

  • టీటీడీ, పోలీసుల ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు వైసీపీ, జగన్‌ మీడియా ప్రతినిధుల కుట్ర

  • తిరుపతి నుంచి ఖాళీ సీసాలు పట్టుకెళ్లి తిరుమలలో పడేశారు

  • వాటిని వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం

  • పక్కా ఆధారాలతో నిందితుల గుర్తింపు

  • వైసీపీ కార్యకర్తలు, జగన్‌ మీడియా

  • ప్రతినిధిపై కేసు.. ఇద్దరి అరెస్టు.. ఒకరు పరారీ

తిరుపతి/తిరుమల, జనవరి 7(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతో పాటు టీటీడీని, పోలీసులను ఇరుకున పెడదామని స్కెచ్‌ వేశారు. కానీ, సీన్‌ రివర్స్‌ కావడంతో అడ్డంగా దొరికిపోయారు. వైసీపీ, జగన్‌ మీడియా ప్రతినిధులు పన్నిన కుట్రను పోలీసులు కనిపెట్టేశారు. తిరుమలలో పోలీసు గెస్ట్‌హౌస్‌ వద్ద ఖాళీ మద్యం సీసాల వీడియో లోగుట్టును రట్టు చేశారు. తిరుపతి నుంచి ఖాళీ మద్యం బాటిళ్లు తీసుకొచ్చి తిరుమలలో పడేసి, వాటిని వీడియోలు తీసి వైరల్‌ చేసినట్టు గుర్తించారు. టీటీడీతో పాటు పోలీసు శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు వైసీపీ కార్యకర్తలు, జగన్‌ మీడియా ప్రతినిధులు కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. ప్రాథమికంగా ముగ్గురిపై కేసు నమోదు చేసిన తిరుమల టూటౌన్‌ పోలీసులు.. వైసీపీ కార్యకర్త ఆళ్ళపాక కోటి, జగన్‌ మీడియా స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌ కృష్ణను బుధవారం అరెస్టు చేశారు.


అసలేం జరిగిందంటే...

తిరుమలలోని కౌస్తుభం అతిథి గృహం సమీపంలో ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్న వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తిరుమల భద్రత, పవిత్రతను కాపాడాల్సిన పోలీసులకు చెందిన గెస్ట్‌హౌస్‌ వద్దే ఈ సీసాలు కనిపించడంతో శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్ళపాక కోటి మరికొందరితో కలసి తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు పట్టుకెళ్లి కౌస్తుభం గెస్ట్‌హౌస్‌ ప్రహరీ సమీపాన పొదల్లో పడేశారు. ఆ సమాచారాన్ని తిరుమలలోని వైసీపీ సోషల్‌ మీడియా విభాగం కార్యకర్త నవీన్‌కు చేరవేశారు. అతను తిరుపతి సాక్షి మీడియా స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌కృష్ణకు విషయం చెప్పడంతో అతను తిరుమలలోని సాక్షి రిపోర్టర్‌ ప్రసాద్‌, సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్‌ ముఖేష్‌, సాక్షి ఫొటోగ్రాఫర్‌ గిరికి సమాచారం ఇచ్చి మద్యం సీసాల వీడియోలు, ఫొటోలు తీయించాడు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయించాడు. దీనికి సంబంధించి కోటి, నవీన్‌, మోహన్‌కృష్ణపై కేసు నమోదైంది. కోటి, మోహన్‌ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నవీన్‌ కోసం గాలిస్తున్నారు.


ఆధారాలు సేకరించారిలా...

ఈ కేసులో జిల్లా పోలీసు యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పక్కా ఆధారాలు సేకరించింది. తిరుమలలో లభ్యమైన ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వాటి తయారీ బ్యాచ్‌ వివరాలతో ఎక్సైజ్‌ శాఖ అధికారులను సంప్రదించారు. సంబంధిత బ్యాచ్‌ సీసాలు ఏయే మద్యం దుకాణాలకు సరఫరా అయ్యాయో ఆరా తీశారు. తిరుపతిలోని ఏ మద్యం షాపులో, ఎప్పుడు వాటిని విక్రయించారు? ఎవరు కొనుగోలు చేశారో గుర్తించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త కోటి ఖాళీ మద్యం సీసాలను ఈ నెల 2న తిరుమల తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలిపిరి టోల్‌గేట్‌లో నిందితుల వాహనాల ఫాస్టాగ్‌ చెల్లింపులు, తిరుమలలో సీసీ కెమెరాల ఫుటేజీ, నిందితుల మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లను జల్లెడ పట్టి ఆధారాలు సేకరించారు. నిందితులతో పాటు వీడియోలు తీసినవారిని విచారించి, వారి మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అయితే మోహన్‌కృష్ణ మొబైల్‌ ఫోన్‌ మాత్రం పోలీసులకు లభ్యం కాలేదు. ఎక్కడో పోగొట్టుకున్నట్టు చెబుతుండటంతో దానికోసం గాలిస్తున్నారు. ఆ ఫోన్‌ లభ్యమైతే కీలక ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు. కాగా, మద్యం సీసాల కేసులో అరెస్టయిన ఇద్దరినీ తిరుపతి రెండో ఏడీజే కోర్టు న్యాయాధికారి కోటేశ్వరరావు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్‌ను తిరస్కరించడంతో స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.


తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ కుట్ర: టీటీడీ చైర్మన్‌

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ కుట్రకు తెగబడిందని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆరోపించారు. మద్యం బాటిళ్లు తిరుమలకు తీసుకొచ్చి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి హల్‌చల్‌ చేసిన వాళ్ల పాపం పండిందన్నారు. ‘టీటీడీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి పనిగట్టుకుని భూమన కరుణాకరెడ్డి తన మనుషులతో అనునిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ నేడు పోలీసులకు దొరికిపోయారు. భూమనకు దేవుడంటే భయం, భక్తి లేదు. ప్రైవేట్‌ సైన్యాన్ని నియమించి టీటీడీపై బురద జల్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా రు. వైసీపీ సోషల్‌ మీడియా, కరుణాకరరెడ్డి చేస్తున్న కుట్రలు బయటపడ్డాయి. తిరుమలపై కుట్రలకు బాధ్యుడు, తొలి ముద్దాయి కరుణాకరరెడ్డి. ఆయన్ను అరెస్టు చేయాలి’ అని బీఆర్‌ నాయుడు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 08 , 2026 | 04:01 AM