Share News

Liquor Identification Number: ‘లిన్‌’తో మద్యం అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Jan 15 , 2026 | 03:56 AM

మద్యం అక్రమాల అడ్డుకట్టకు ఎక్సైజ్‌ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. లిక్కర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు(లిన్‌)ను అమల్లోకి తీసుకొస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం లిక్కర్‌, బీరు, వైన్‌ రూల్స్‌కు సవరణలు చేసింది.

Liquor Identification Number: ‘లిన్‌’తో మద్యం అక్రమాలకు చెక్‌

  • ప్రతి మద్యం సీసాకు ఓ గుర్తింపు నంబరు

  • స్టేట్‌కు, బ్రాండ్‌కు ప్రత్యేక కోడ్‌

  • 20కు పైగా అంకెలతో లిన్‌

  • సీసా లేబుల్‌పైనే నంబరు ముద్రణ

  • అది చించేస్తే బ్రాండ్‌ పేరూ పోతుంది

  • బెల్టులు, నకిలీల అడ్డుకట్టకు ఎక్సైజ్‌ గట్టి చర్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మద్యం అక్రమాల అడ్డుకట్టకు ఎక్సైజ్‌ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. లిక్కర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు(లిన్‌)ను అమల్లోకి తీసుకొస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం లిక్కర్‌, బీరు, వైన్‌ రూల్స్‌కు సవరణలు చేసింది. లిన్‌తో బెల్టులు, నకిలీ మద్యానికి చెక్‌ పెట్టొచ్చని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. లిన్‌లో ప్రత్యేక గుర్తింపు నంబరు ఉంటుంది. ఇది ప్రతి సీసాకూ మారిపోతుంది. ఏపీకి ఒక కోడ్‌, బ్రాండ్‌కు ఒక కోడ్‌ ఇచ్చి ఆ తర్వాత బ్యాచ్‌ నంబరు, లైన్‌ నంబరు, సంవత్సరంతో కలిపి తేదీ, గంటలు, నిమిషాలు, సెకన్లు, మిల్లీ సెకన్లతో సహా ఒక పెద్ద నంబరును సీసాపై ముద్రిస్తారు. లిన్‌ నంబరు 20 కంటే ఎక్కువ అంకెలతో ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 240 మద్యం బ్రాండ్లు ఉన్నాయి. ప్రతి బ్రాండ్‌కు ప్రత్యేక కోడ్‌ ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక బ్యాచ్‌కు ఒక నంబరు ముద్రిస్తున్నారు. ఒక బ్యాచ్‌లో వేల సంఖ్యలో సీసాలు ఉత్పత్తి అవుతాయి. లిన్‌తో ప్రతి సీసాకు ప్రత్యేకంగా నంబరు వస్తుంది. అయితే దానిని లేబుల్‌పై ముద్రించడమే కీలకం.


హీల్‌ కోడ్‌లు చించేస్తున్నారు

మద్యాన్ని బెల్టు షాపుల్లో పెట్టి అమ్మేవారు మొట్టమొదట సీసా మూతలపై ఉండే హీల్‌ కోడ్‌లను చించేస్తారు. హీల్‌ కోడ్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే వివరాలు తెలిసిపోతాయి. అక్రమంగా మద్యం అమ్మేవారు హీల్‌ కోడ్‌లు తొలగిస్తే.. ఎక్సైజ్‌ దాడుల్లో సీసా పట్టుబడినా కచ్చితంగా ఎక్కడినుంచి వచ్చిందనే సమాచారం ఉండదు.

లిన్‌లో ఏం చేస్తారు?

లిన్‌ను బ్రాండ్‌ పేరు ఉండే లేబుల్‌పైనే ముద్రిస్తారు. లిన్‌లో సీసాకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ప్రతి సీసాకూ లిన్‌ మారిపోతుంది. బెల్టులు నడిపేవారు అది చించివేస్తే బ్రాండ్‌ పేరు కూడా పోతుంది. అప్పుడు వినియోగదారులు ఆ సీసాలను కొనేందుకు ఆసక్తి చూపరు. అలాగే మూతపై ఉండే హీల్‌ కోడ్‌ను, సీసాపై ఉండే బార్‌ కోడ్‌ను లింక్‌ చేస్తారు. దీనివల్ల హీల్‌ కోడ్‌ పోయినా బార్‌కోడ్‌లో దొరికిపోతారని ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిన్‌ వల్ల బెల్టులతో పాటు నకిలీ మద్యానికీ చాలావరకు అడ్డుకట్ట పడుతుంద ంటున్నాయి. నకిలీ మద్యం ఉత్పత్తి చేసేవారు నకిలీ హీల్‌ కోడ్‌లు, లేబుళ్లు కూడా తయారుచేసే అవకాశం ఉంది. లిన్‌ నంబరు వస్తే ప్రతి బ్రాండ్‌కు ప్రత్యేకమైన కోడ్‌, ఎక్కువ అంకెలు ఉండటం వల్ల నకిలీ తయారు అసాధ్యం అంటున్నారు.

Updated Date - Jan 15 , 2026 | 03:57 AM