Share News

అకాల వర్షం.. పిడుగుల పంజా

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:40 AM

అకాల వర్షంతోపాటు పిడుగులు పడి ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 14 మేకలు, ఒక గేదె కూడా మృత్యువాతపడ్డాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గురువారం....

అకాల వర్షం.. పిడుగుల పంజా

  • వ్యవసాయ కూలీ మృతి.. మరొకరికి గాయాలు

  • 14 మేకలు, ఒక గేదె మృత్యువాత

  • నంద్యాల జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత

  • నేటి నుంచి మరింత పెరగనున్న ఎండలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

అకాల వర్షంతోపాటు పిడుగులు పడి ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 14 మేకలు, ఒక గేదె కూడా మృత్యువాతపడ్డాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గురువారం అక్కడక్కడ పిడుగులతో వర్షం కురిసింది. కర్నూలు జిల్లాకకు చెందిన సుమారు 50 మంది వ్యవసాయ కూలీలు మిర్చి కోతల నిమిత్తం ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టావారిపాలేనికి వచ్చారు. గురువారం సాయంత్రం వీరు పొలంలో మిర్చి కోస్తుండగా.. ఆ ప్రాంతంతో పిడుగు పడింది. దీంతో వ్యవసాయ కూలీ పాలె సురేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యవసాయ కూలీ జగదీశ్‌కు గాయాలవడంతో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇదే జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో పిడుగు పాటుకు రూ.3 లక్షలు విలువ చేసే 14 మేకలు, లక్ష రూపాయలకుపైగా విలువ చేసే ఒక గేదె చనిపోయాయి. మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి పిడుగురాళ్ల మార్కెట్‌ యార్డులో ఆరబోసిన ధాన్యం నీళ్లపాలైంది.

18 కేంద్రాల్లో 40 డిగ్రీలకు పైగా..

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. సుమారు 18 కేంద్రాల్లో గురువారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా దొర్నిపాడు, డబ్ల్యూ.కొత్తపల్లిల్లో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా ముద్దనూరులో 42.7, ప్రకాశం జిల్లా బల్లికురవలో 42.6, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.5, మధ్యాహ్నం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో ఎండలు పెరుగుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత కూడా ఎండలు కొనసాగుతాయని, 16వ తేదీ నుంచి ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. రానున్న రెండు రోజుల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Updated Date - Apr 10 , 2026 | 03:40 AM