కోస్తాలో పిడుగుల బీభత్సం
ABN , Publish Date - Apr 07 , 2026 | 06:01 AM
కోస్తా ప్రాంతంలో అకాలం వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం పిడుగులు పడి వివిధ జిల్లాల్లో 8 మంది మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. అలాగే, పక్కరాష్ట్రం ఒడిసాకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసి అక్కడ పిడుగుపాటుకు మరణించారు.
వివిధ జిల్లాల్లో 8 మంది మృతి.. సీమలో కొనసాగిన ఎండ తీవ్రత
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కోస్తా ప్రాంతంలో అకాలం వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం పిడుగులు పడి వివిధ జిల్లాల్లో 8 మంది మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. అలాగే, పక్కరాష్ట్రం ఒడిసాకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసి అక్కడ పిడుగుపాటుకు మరణించారు. గాలివానకు చెట్లు కూలి పలుచోట్ల వాహనాలు ధ్వంసమవడంతోపాటు ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయి, వైర్లు తెగిపడి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. పంటలకు కూడా నష్టం వాటిల్లింది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ ఆవరణలో పిడుగు పడి బిహార్‌కు చెందిన కూలీ కన్నయ్య(18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా కొమరోలు సమీపంలో పిడుగుపడి.. కూలి పనులకు వెళ్లి వస్తున్న ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెకు చెందిన బొందలపాటి నాగయ్య (60) మృతి చెందారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మడతల శ్రీనివాసరెడ్డి(42) ఎద్దులు కొనేందుకు మార్కాపురం జిల్లాకు వచ్చి చాపలమడుగు రెవెన్యూ కొత్తూరు గ్రామ శివారులో పిడుగుపడి ప్రాణాలు విడిచారు. ఆయన మిట్టమీదపల్లెకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అని పోలీసులు తెలిపారు. కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ సమీపంలో పిడుగుపడి బిహార్‌కు చెందిన దుర్గేశ్‌కుమార్(25) మృతిచెందారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములబండ-అయోధ్యనగర్ గ్రామాల మధ్య పొలాల్లో పిడుగుపడి గొర్రెల కాపరి రావులపల్లి శివకృష్ణ (22) మృతిచెందారు. ఆ సమయంలో ఆయన సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా.. సెల్‌ఫోన్ కాలిపోయి, శివకృష్ణ చెవి నుంచి రక్తం కూడా వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం సామంతపూడిలో గేదెల మేతకోసం వెళ్లి తిరిగి వస్తున్న ఆవుల మల్లికార్జున(24) పిడుగుపడి మృతిచెందారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన డి.సింహాచలమమ్మ(39) పొలంలో మొక్కజొన్న పొత్తులపై టార్పాలిన్ కప్పుతుండగా పిడుగుపడటంతో మరణించారు. ఇదే జిల్లా బలిజపేట మండలం వంతరాం గ్రామానికి చెందిన వి.పార్వతమ్మ(40) పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా పిడుగుపడి మరణించారు. ఆమె భర్త వేణుగోపాలనాయుడు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళంలో కుండపోత..
శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ గాలులకు విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. చెట్లు విరిగిపడ్డాయి. శ్రీకాకుళంలో మూడున్నర గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏలూరు జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు, చెట్టుకొమ్మలు విరిగిపడి బైక్‌లు, కార్లు ధ్వంసమయ్యాయి. వరి పంట నేల కొరిగింది. మొక్కజొన్న, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ఏలూరులో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ మొక్కజొన్న, మామిడి, ధాన్యం, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటుక బట్టీల్లోకి నీరు చేరింది.
వాతావరణ అనిశ్చితి
దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తెలంగాణ, ఒడిశాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. తీవ్రమైన ఎండలు, ఉత్తరాది నుంచి పొడిగాలుల ప్రభావంతో కోస్తాలో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం లక్ష్మీపురంలో 57.5, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, కోనసీమ జిల్లా రామచంద్రాపురంలలో 52.5, ఏలూరు జిల్లా తాడువాయిలో 47.5, నిడదవోలులో 40.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాలు, కోస్తాలో పలుచోట్ల ఎండతీవ్రత కొనసాగింది. అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42, కడప జిల్లా రాజుపాలెంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా గాలివానతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.